Elvish Honey: ఈ తేనె బంగారం కన్నా విలువైనది.. ఎందుకంటే?
ABN , Publish Date - Jan 06 , 2026 | 04:17 PM
తేనె అంటే ఇష్టపడని వారు ఎవరైనా ఉంటారా? చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తేనె తినేందుకు ఆసక్తి చూపుతారు. తేనెలో తీయదనమే కాదు.. బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత ఖరీదైన తేనె ఒకటుంది.. అది ఎందుకంత ఖరీదో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: తేనె అంటే ప్రతి ఒక్కరూ ఎంతగానో ఇష్టపడతారు. తేనెలో కమ్మని తీయదనమే కాదు.. అద్భుతమైన ఔషధాలు కూడా ఉన్నాయి. తేనె(Honey)ను యాంటీ బ్యాక్టీరియల్ (Antibacterial) గా భావిస్తారు. ప్రతి ఒక్కరి ఇంట్లో తేనె తప్పకుండా ఉంటుంది. ప్రపంచంలో భిన్నరకమైన తేనెల అందుబాటులో ఉంటాయి. మార్కెట్(Market) లో లభ్యమయ్యే తేనె కిలో వెయ్యి రూపాయల వరకు ఉంటుంది. కానీ, ప్రపంచంలో అత్యంత ఖరీదైన తేనె ఉంది. ‘ఎల్విష్ తేనె’ (Elvish Honey) దీని రంగు, స్వచ్ఛత, రుచి కారణంగా దీన్ని బంగారం కన్నా ఎక్కువ ఖరీదుగా భావిస్తారు. దీని ధర కిలో దాదాపు రూ.9 లక్షలు(సుమారు 10,000 యూరోలు) ఉంటుంది. ఈ తేనెకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

ఈ తేనె సాధారణంగా తేనె తుట్టెల్లో లాగా పెంపక కేంద్రాల్లో దొరకదు. ఇది టర్కీలోని ఆర్ట్విన్ నగరంలో.. దాదాపు 1800 మీటర్ల లోతైన గుహలో సహజ సిద్ధంగా లభిస్తుంది. అత్యంత లోతైన ప్రదేశం నుంచి ఈ తేనెను సేకరించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఈ గుహల చుట్టూ మనుషులు వెళ్లలేని అటవీ ప్రాంతం ఉంటుంది. అక్కడ పెరిగే అరుదైన ఔషధ మొక్కల నుంచి తేనె టీగలు మకరందాన్ని సేకరించి తేనెను తయారు చేస్తాయి. అందుకే ఈ తేనెలో ఎంతో గొప్ప ఔషధ గుణాలు ఉన్నాయి.

సాధారణంగా తేనెను ఏడాదికి 2-3 సార్లు తీస్తారు, కానీ ఎల్విష్ తేనెను ఏడాదికి ఒక్కసారి మాత్రమే సేకరిస్తారు. ఇది ప్రభుత్వ పర్యవేక్షణలో నిపుణుల మాత్రమే సేకరిస్తారు. దీని నాణ్యతను టర్కీ ఫుడ్ ఇన్‌స్టిట్యూట్ (Turkey Food Institute)వారు తనిఖీ చేసిన తర్వాతే మార్కెట్‌లోకి విడుదల చేస్తారు. ఈ తేనెలో మెగ్నీషియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీని రుచి సాధారణ తేనెలా తీపిగా కాకుండా, కొంచెం వగరుగా, చేదుగా ఉంటుంది. ఈ తేనె ఎన్నో రకాల వ్యాధులను నయం చేయడమే కాకుండా, రోగ నిరోధక శక్తిని అద్భుతంగా పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి...
ఎమ్మెల్సీ ఫ్లెక్సీ తొలగింపు.. ఉద్రిక్తం
‘మీ పని అద్భుతం’.. మంత్రులు, అధికారులకు సీఎం కితాబు