అయ్యో.. వరదలో కొట్టుకుపోయిన మహిళ.. వీడియో వైరల్
ABN , Publish Date - May 22 , 2026 | 11:03 AM
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో బస్సు దిగుతుండగా ఓ మహిళ ఉధృతమైన వరద నీటిలో కొట్టుకుపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని న్యూయార్క్ సిటీ భారీ వర్షాలు, ఉరుములతో కూడిన తుపానుల కారణంగా అతలాకుతలమైంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాలు ఆకస్మిక వరదలకు గురయ్యాయి. ముఖ్యంగా క్వీన్స్, బ్రూక్లిన్ ప్రాంతాల్లో రహదారులు నీటితో నిండిపోయాయి. వరద ప్రభావంతో సబ్‌వే సేవలు కూడా నిలిచిపోవడంతో పలువురు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, కొన్ని ప్రాంతాల్లో గంట వ్యవధిలోనే దాదాపు 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఈ వరదల తీవ్రతను చూపించే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 15 సెకన్ల నిడివి గల ఆ వీడియోలో పింక్ కలర్ డ్రెస్ ధరించిన ఓ మహిళ బస్సు దిగుతుండగా వరద ప్రవాహంలో కొట్టుకుపోవడం కనిపించింది. భారీ వరద కారణంగా బస్సును రోడ్డు పక్కకు ఆపలేక డ్రైవర్ రోడ్డు మధ్యలోనే ఆపాడు. దీంతో ప్రయాణికులు నేరుగా వరద నీటిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ సమయంలో ఆ మహిళ ఫుట్‌పాత్ చేరేందుకు ప్రయత్నించగా, వరద ప్రవాహం బలంగా ఉండటంతో అదుపు తప్పి రోడ్డుపక్క అంచుకు ఢీకొట్టి నీటిలో కొట్టుకుపోయింది. ఆమెను చూసి అక్కడున్న వారు సహాయం చేయడానికి పరుగెత్తుకుంటూ వెళ్లినా, వరద ప్రవాహం చాలా వేగంగా ఉండటంతో ఆమెను రక్షించలేకపోయారు. ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పలువురు స్పందించారు. 'డ్రైవర్ బస్సును ఫుట్‌పాత్‌కు ఇంకాస్త దగ్గరగా ఆపి ఉంటే బాగుండేది' అని కొందరు, ఆమె సురక్షితంగా ఉండాలని ఆశిస్తున్నాం' అంటూ మరికొందరు కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉండగా, న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ మాట్లాడుతూ.. భారీ వర్షాల కారణంగా నగర మురుగునీటి వ్యవస్థ పనిచేయకుండా పోయిందని తెలిపారు. సాధారణంగా గంటకు రెండు అంగుళాల వర్షాన్ని తట్టుకునేలా వ్యవస్థను రూపొందించారని, అయితే ఈసారి అంతకంటే ఎక్కువ వర్షం కురిసిందన్నారు. వరదలతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు అధికారిక వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని, అత్యవసర సహాయం కోసం 311కు కాల్ చేయాలని అధికారులు సూచించారు.
Also Read:
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఏపీలో ఖాళీ కానున్న 4 స్థానాలు
అమెరికాలో కాల్పులు.. 25 మంది మృతి