ఆ పెళ్లికి వెళితే నన్ను బతకనీయరు.. మీడియాపై ట్రంప్ సెటైర్లు
ABN , Publish Date - May 22 , 2026 | 10:29 AM
తన కుమారుడి పెళ్లికి హాజరవడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సరదా వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పెళ్లికి వెళితే ఫేక్ న్యూస్ మీడియా తనను బతకనీయదని సెటైర్లు పేల్చారు.
ఇంటర్నెట్ డెస్క్: తన కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ పెళ్లికి హాజరవడంపై మీడియా అడిగిన ప్రశ్నలకు యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెటైర్లు పేల్చారు. ఆ పెళ్లికి వెళ్లినా, వెళ్లకున్నా తనను బతకనీయరని సరదాగా వ్యాఖ్యానించారు.
బహామస్‌లో ట్రంప్ జూనియర్ వివాహం ఈ వారాంతంలో జరగనుంది. పామ్ బీచ్ సోషలైట్ బెట్టినా ఆండర్సన్‌ను ఆయన వివాహమాడనున్నారు. అయితే, ఈ వివాహ కార్యక్రమానికి అధ్యక్షుడు ట్రంప్ కుటుంబసభ్యులు, సన్నిహితులు కొద్ది మంది మాత్రమే హాజరయ్యే అవకాశం ఉన్నట్టు అక్కడి మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో శ్వేతసౌధంలో జరిగిన సమావేశంలో ట్రంప్‌పై విలేకరులు పలు ప్రశ్నలను సంధించారు.
మీరు ఆ వివాహానికి వెళతారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ట్రంప్ బదులిస్తూ తాను వెళ్లాలనే అనుకుంటున్నట్టు చెప్పారు. ‘నేను పెళ్లికి రావాలని ట్రంప్ జూనియర్ పట్టుబడుతున్నాడు. నేనూ వెళ్లడానికే ప్రయత్నిస్తున్నాను. నేను ఆ పెళ్లికి వెళ్లకపోతే నాకు మూడినట్టే.. ఒక వేళ వెళ్లినా కూడా ఈ ఫేక్ మీడియా నన్ను బతకనీయదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది క్లిష్టమైన నిర్ణయం. ఇరాన్‌తో పాటు ఇతర వ్యవహారాలపై దృష్టిసారించాల్సి ఉంది’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇరాన్ వ్యవహారంలో ట్రంప్ ప్రభుత్వంపై క్రమంగా అమెరికాలో విమర్శలు పెరుగుతున్నాయి. అమెరికన్లకు ఈ యుద్ధం ఆర్థిక భారంగా మారుతోందన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. ఈ క్లిష్ట సమయంలో తాను వ్యక్తిగత వ్యవహారాలపై దృష్టిపెడితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని ట్రంప్ అంగీకరించారు.
ఈ వార్తలనూ చదవండి:
యురేనియాన్ని వదులుకోం.. ఇరాన్ స్పష్టీకరణ
ఇరాన్‌ను వదిలేసి.. క్యూబాపై ట్రంప్ ఫోకస్!