ఇరాన్‌ను వదిలేసి.. క్యూబాపై ఫోకస్!
ABN , Publish Date - May 22 , 2026 | 03:45 AM
కీలకమైన సుప్రీంలీడర్ అయతొల్లా ఖమేనీని చంపేసినా, ఉధృత దాడులతో కకావికలం చేసినా.. ఇరాన్ దిగిరాకపోవడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పునరాలోచనలో...
పశ్చిమాసియా వ్యవహారం ఎంతకీ తెగేలా లేకపోవడంతో ట్రంప్ యోచన
వాషింగ్టన్, మే 21: కీలకమైన సుప్రీంలీడర్ అయతొల్లా ఖమేనీని చంపేసినా, ఉధృత దాడులతో కకావికలం చేసినా.. ఇరాన్ దిగిరాకపోవడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పునరాలోచనలో పడ్డారా?ఇరాన్‌పై యుద్ధాన్ని అర్ధంతరంగా వదిలేసి కొత్త లక్ష్యంపై దృష్టిపెట్టారా? చాలా కాలం నుంచి కొరకరాని కొయ్యగా ఉన్న క్యూబాపై దాడులు చేయాలని భావిస్తున్నారా?.. ఇటీవలి పరిణామాలకు తోడు అమెరికా మీడియాలో వస్తున్న కథనాలు, ట్రంప్ వ్యాఖ్యలు ఈ అభిప్రాయమే కలిగిస్తున్నాయి. క్యూబా స్వాతం త్య్ర దినోత్సవమైన బుధవారం రోజునే (మే 20న) ఆ దేశ మాజీ అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రోను అమెరికా ప్రజలను చంపిన నేరస్తుడిగా అమెరికా న్యాయశాఖ ప్రకటించింది. మరోవైపు అమెరికా సెంట్రల్ కమాండ్ క్యూబాకు సమీపంగా మూడు యుద్ధనౌకలను మోహరించింది. క్యూబా విషయంలో అమెరికా గత అధ్యక్షులు చూస్తూ ఉండిపోయారని, ఏదైనా చేయగలిగేది తానేనని తాజాగా ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇక క్యూబాపై సైనిక చర్యకు అమెరికా సిద్ధమవుతోందంటూ ఆ దేశ రక్షణ వర్గాలను ఉటంకిస్తూ ‘పొలిటికో’ వార్తాసంస్థ కథనం ప్రచురించింది. వెనెజువెలా అధ్యక్షుడు మదురోను ఎత్తుకొచ్చేసినట్టుగా.. క్యూబాలోని కీలక నేతలను అరెస్టు చేసి, ప్రభుత్వాన్ని మార్చాలని, తద్వారా విదేశాంగ విధానంలో పెద్ద విజయం సాధించానని చూపుకోవాలని ట్రంప్ భావిస్తున్నట్టు పేర్కొంది. అవసరమైతే భూతల దాడులకూ సిద్ధంగా ఉండాలని సైన్యానికి సంకేతాలు వచ్చాయని వెల్లడించింది.
ఇరాన్‌పై ట్రంప్ వర్సెస్ నెతన్యాహు?
పశ్చిమాసియా సంక్షోభానికి ముగింపు పలికే దిశగా ఇరాన్‌తో దౌత్య పరిష్కారానికి మొగ్గు చూపుదామని ట్రంప్ పేర్కొంటే.. దాడులు కొనసాగిద్దామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పట్టుబట్టినట్టు తెలిసింది. బుధవారం ఇరువురు నేతల మధ్య ఫోన్‌లో గంటకుపైగా జరిగిన సంభాషణ వాడీవేడిగా జరిగిందని.. ఇరువురి మధ్య తీవ్ర భేదాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని అమెరికా ఉన్నతాధికారులను ఉటంకిస్తూ యాక్సియోస్ వార్తా సంస్థ కథనం ప్రచురించింది. కాగా, ఇరువురి మధ్య వాగ్వాదం స్థాయిలో సంభాషణ జరిగిందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇరాన్‌తో మొదటి దఫా చర్చలు జరిపిన సమయంలో నెతన్యాహు ఆందోళన వ్యక్తం చేశారని, ఇప్పుడు ట్రంప్‌తో ఫోన్ కాల్ తర్వాత ఆయన మరింత ఆందోళనగా కనిపించారని పేర్కొన్నాయి.