Share News

కేంద్ర మంత్రుల్లో వేటు ఎవరిపై?

ABN , Publish Date - May 22 , 2026 | 04:03 AM

కేంద్ర మంత్రివర్గంలో భారీగా మార్పులు, చేర్పులు జరగనున్నాయన్న అంచనాల నేపథ్యంలో గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం..

కేంద్ర మంత్రుల్లో వేటు ఎవరిపై?

  • సేవాతీర్థ్‌లో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం.. హాజరైన సహాయ, స్వతంత్ర, క్యాబినెట్‌ మంత్రులు

  • శాఖల వారీగా పనితీరు నివేదికలను వివరించిన క్యాబినెట్‌ కార్యదర్శి

  • కొందరు మంత్రులకు మోదీ క్లాసు

  • ప్రభుత్వ పనితీరు మారాలని హితవు

న్యూఢిల్లీ, మే 21 (ఆంధ్రజ్యోతి): కేంద్ర మంత్రివర్గంలో భారీగా మార్పులు, చేర్పులు జరగనున్నాయన్న అంచనాల నేపథ్యంలో గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం.. ఆ అంచనాలను బలపరిచే సంకేతాలనే ఇచ్చింది. తమ శాఖల పనితీరును వివరించే నివేదికలను వెంట తీసుకెళ్లిన మంత్రులు.. అప్పటికే ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ఆయా శాఖల వారీగా తయారు చేసిన నివేదికలను చూసి ఖంగుతిన్నట్లు సమాచారం. తొలుత సమావేశాన్ని ఉద్దేశించి మోదీ మాట్లాడిన తర్వాత.. క్యాబినెట్‌ కార్యదర్శి మంత్రిత్వ శాఖల వారీగా మంత్రులు, వారి కార్యదర్శుల పనితీరును వివరించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయా మంత్రులు, కార్యదర్శులు తమ బాఽధ్యతల నిర్వహణలో తీసుకున్న చర్యలు, లక్ష్యాలను సాఽధించడంలో వైఫల్యాలు, సరిదిద్దుకోవాల్సిన అంశాల గురించి మోదీ సమగ్రంగా సమీక్షించారు. వివిధ ప్రభుత్వ పథకాల అమలు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రధాని.. మంత్రులకు, కార్యదర్శులకు క్లాసు తీసుకున్నట్లు సమాచారం. ‘దీంతో తమలో ఎవర్ని తప్పిస్తారు? కొనసాగిస్తే ఇప్పుడున్న శాఖలోనేనా? లేకపోతే వేరే ఏదైనా శాఖకు మారుస్తారా?’ అన్న ఆందోళన మంత్రుల్లో కనపడిందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఐదు దేశాల పర్యటన ముగించుకొని బుధవారం రాత్రి తిరిగి వచ్చిన నరేంద్రమోదీ.. గురువారం సాయంత్రమే సహాయ మంత్రులతో సహా క్యాబినెట్‌ మంత్రులందర్నీ సేవాతీర్థ్‌లోని తన కార్యాలయంలో సమావేశానికి రావల్సిందిగా ఆదేశించారు. ఆయా శాఖలకు చెందిన సెక్రటరీలను కూడా ఈ సమావేశానికి పిలిచారు. 30 మంది క్యాబినెట్‌ మంత్రులు, ఐదుగురు స్వతంత్ర స్థాయి సహాయమంత్రులు, 36 మంది సహాయమంత్రులతోపాటు వారి కార్యదర్శులు హాజరయ్యారు. మోదీ మూడో దఫా పదవీ కాలానికి జూన్‌ 9తో రెండేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో పరిపాలనా ప్రాధాన్యతలను నిర్ణయించడం, మంత్రిత్వ శాఖల పనితీరుపై సమీక్షను ఎజెండాగా నిర్ణయించారు.


సుదీర్ఘకాలం సంక్షోభం కొనసాగే అవకాశం

ప్రధాని మోదీ ప్రసంగంతో సమావేశం ప్రారంభమైంది. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభంతో ఎదురవుతున్న ఇంధన సమస్య గురించి ప్రధాని వివరించారు. ఈ సంక్షోభం దీర్ఘకాలం కొనసాగే అవకాశాలున్నాయన్నారు. దేశంలో చమురు, ఇంధన నిల్వలు మరో 5 నెలల వరకు సరిపోతాయని, అయినప్పటికీ రాబోయే పరిణామాలకు ఇప్పటినుంచే సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రజలను తాను అప్రమత్తం చేశానని, అయితే మొత్తం ప్రభుత్వ పనితీరు మారాల్సిన అవసరం ఉన్నదని.. ప్రతి ఒక్కరూ సైనిక క్రమశిక్షణతో పనిచేయాలని, వీలైనంతగా ప్రజాధనాన్ని పొదుపు చేయాలని మోదీ హితవు పలికినట్లు సమాచారం. ప్రపంచ పరిణామాల నేపథ్యంలో దేశం ఎదుర్కొనే క్లిష్ట పరిస్థితులకు కలిసికట్టుగా సమాయత్తం కావాలని, అత్యంత సమర్థవంతంగా పని చేసి మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు. నిరుద్యోగ సమస్యను ఎదుర్కొనేందుకు జాతీయ రోజ్‌గార్‌ మేళా గురించి కూడా చర్చించినట్లు తెలిసింది. సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమైన సమావేశం రాత్రి 9.45 గంటల వరకు కొనసాగింది. మధ్యలో 8.15 గంటల వద్ద కొద్దిసేపు అల్పాహార విరామం తీసుకున్నారు. కాగా, ఈ సమీక్ష ప్రాతిపదికగా త్వరలో భారీ ఎత్తున మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని, సహాయమంత్రులతో సహా దాదాపు 25-30 మంది మంత్రులకు ఉద్వాసన తప్పదని, కొత్తవారికి అవకాశం లభిస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నెలాఖరులోపు బీజేపీ ఆఫీసు బేరర్ల నియామకం పూర్తవుతుందని, మంత్రివర్గం నుంచి తప్పించే పలువురికి పార్టీలో బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. ఆ తర్వాత వెంటనే క్యాబినెట్‌ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Updated Date - May 22 , 2026 | 05:52 AM