పరిమితులను చెరిపేసిన సంకల్పం... వీల్ ఛైర్ నుంచి ఎవరెస్ట్ దాకా..
ABN , Publish Date - Mar 10 , 2026 | 10:32 AM
వీల్ ఛైర్‌కు పరిమితం కావాల్సిన పరిస్థితిని జయించి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేరుకున్న ఓ వ్యక్తి.. తన దృఢ సంకల్పంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఇప్పుడు అదే ఆత్మవిశ్వాసంతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 4 వేల కిలోమీటర్ల సైకిల్ యాత్రకు సిద్ధమవుతూ మరెందరికో ప్రేరణగా నిలుస్తున్నారు. ఆ ప్రేరణాత్మక కథనం మీకోసం...
ఇంటర్నెట్ డెస్క్: ఎలాంటి పరిమితులనైనా అధిగమించే మానసిక దృఢత్వమే విజేతలకు ఉండే గొప్ప లక్షణం. సామాన్యులను అసామాన్యులుగా మార్చే శక్తి ఇదే. ప్రస్తుతం.. మనం చెప్పుకోబోతున్న రావి రమేశ్ బాబు కూడా ఇలాంటి విజేతల్లో ఒకరు. జీవితాంతం వీల్ ఛైర్‌కు పరిమితం కావాల్సిన స్థితిని అధిగమించిన ఆయన ఏకంగా ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను చేరగలిగారు. మోకాళ్లు, వెన్నెముక సర్జరీలతో కదల్లేని దుర్భర స్థితిని జయించి ఇప్పుడు కశ్మీర్ టూ కన్యాకుమారి సైకిల్ యాత్రకు సిద్ధమవుతున్నారు. తాజాగా.. ఆయన్ను ఏబీఎన్-ఆంధ్రజ్యోతి డైరెక్టర్ కోగంటి భాను ప్రకాష్ ఇంటర్వ్యూ చేసి ఆ వివరాలను 'ఎక్స్' వేదికగా పంచుకున్నారు.
పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కృష్ణా జిల్లా మోపిదేవి మండలం రావివారి పాలెం గ్రామానికి చెందిన రావి రమేశ్ బాబు విజయవాడలో స్థిరపడ్డారు. 2010లో తన 50వ ఏట ప్రమాదంలో ఆయనకు రెండుసార్లు మోకాళ్ల సర్జరీ జరిగింది. ఆ తరువాత వెన్నెముక శస్త్రచికిత్స కూడా చేయించుకోవాల్సి వచ్చింది. ఫలితంగా వీల్ ఛైర్‌కు పరిమితం కావాల్సి వచ్చింది. జీవితాంతం ఇలాగే ఉండాల్సిరావచ్చని వైద్యులే అన్నారు. ఆ సమయంలో రావి రమేశ్ మిత్రుడొకరు ఇచ్చిన 'హీల్ ది బాడీ హీల్ ది మైండ్' పుసక్తం ఆయనకు కొత్త శక్తినిచ్చింది. ఆ పుస్తకం చదివాక మనసులో దృఢ సంకల్పం వేళ్లూనుకుంది.
ఆ నూతనోత్సాహంతో రావి రమేశ్ బాబు తన శరీరంపై పట్టు సాధించేందుకు రంగంలోకి దిగారు. చిన్న చిన్నగా అడుగులు వేస్తూ శారీరక దృఢత్వం కోసం ప్రయత్నించారు. ఆరు నెలల పాటు ఆయన సాగించిన అలుపెరగని ప్రయత్నం ఫలితాన్ని ఇవ్వడంతో నడక మెరుగుపడింది. వేగం పెరిగింది. అక్కడితో సంతృప్తి చెందకుండా మరింత దూరం నడవడం ప్రారంభించారు. చివరకు ఏకబిగిన 40 కిలోమీటర్లు నడిచే స్థితికి చేరుకున్నారు. ఆరోగ్యవంతులకు కూడా అంత సులభంగా సాధ్యంకాని ఫీట్ ఇది. ఈ క్రమంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సైక్లింగ్ పాత్రను కూడా గుర్తించి.. దాన్ని జీవితంలో ఒక భాగంగా చేసుకున్నారు. సైకిల్‌పై యావత్ దేశం చుట్టిరావాలన్న సంకల్పంతో తొలుత యూత్ హాస్టల్స్‌ను సంప్రదించారు. వయసు రీత్యా ఆయనను వారు తిరస్కరించినా.. పట్టుదలతో డాక్టర్ సర్టిఫికేట్ సంపాదించి లక్ష్యం దిశగా అడుగులు ముందుకువేశారు.
ఫ్రాన్స్‌కు చెందిన ఆడాక్స్ క్లబ్ నిర్వహించే పోటీల్లో పాల్గొని విజయం దిశగా దూసుకెళుతున్నారు. ఇప్పటికే ఆయన విజయవాడ - హైదరాబాద్ - విజయవాడ 600 కిలోమీటర్ల సైకిల్ యాత్రను పూర్తిచేశారు. తిరుచ్చి - రామేశ్వరం 600 కిలోమీటర్లు, మనాలి - లబ్లాక్ 500 కిలోమీటర్లు, హైదరాబాద్ చీరాల 360 కిలోమీటర్లు, ఇటీవల.. కరీంనగర్ - గోదావరఖని - హైదరాబాద్ - కరీంనగర్ 400 కిలోమీటర్లు పూర్తి చేశారు. కేరళ, గోవా రాష్ట్రాలను కూడా సైకిల్‌పై చుట్టొచ్చారు. అంతేకాకుండా 20,700 అడుగుల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ శిఖర బేస్ క్యాంప్ వరకూ ట్రెక్కింగ్ చేసి తన సత్తాను చాటుకున్నారు. కొన్ని యాత్రలకు గానూ సూపర్ రాండోనర్ అవార్డు కూడా సొంతం చేసుకున్నారు. సంకల్పం దృఢంగా ఉంటే సాధించలేనిది ఏదీలేదని నిరూపించారు. ఈ విజయాలు ఇచ్చిన ఉత్సాహంతో మరింత సమున్నత లక్ష్యాన్ని రావి రమేశ్ నిర్దేశించుకున్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ 4 వేల కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర చేసేందుకు సంకల్పించుకున్నారు.
ఇవీ చదవండి:
ఢిల్లీ మద్యం స్కాం రౌజ్ ఎవెన్యూ కోర్టు వ్యాఖ్యలపై స్టే
ఇరాన్ యుద్ధం.. పెట్రోల్, గ్యాస్, ఎరువుల నిల్వలు సరిపోతాయా..
ఆయుధ దిగుమతుల్లో రెండో స్థానంలో భారత్.. తొలి స్థానంలో ఉక్రెయిన్