రైలు ప్రయాణమంటే ఇంత సాహసం చేయాలా?.. వీడియో వైరల్
ABN , Publish Date - Sep 09 , 2026 | 09:09 AM
జనాభా పెరిగినట్లుగా రవాణా సౌకర్యాలు పెరగడం లేదు. దీంతో రవాణా వాహనాల్లో ఇరుక్కుని, వాటిపైకి ఎక్కి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇంటర్నెట్ డెస్క్: జనాభా పెరిగినట్లుగా రవాణా సౌకర్యాలు పెరగడం లేదు. దీంతో రవాణా వాహనాల్లో ఇరుక్కుని, వాటిపైకి ఎక్కి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా అన్ని దేశాల్లో ఇదే పరిస్థితి. అలాంటి ఓ వీడియో వైరల్ అవుతోంది. రైల్వే స్టేషన్‌లో రైలు ఆగి ఉంది. బోగిపైన ప్రయాణం చేసిన వారిలో పలువురు.. చేతిలోని బ్యాగులను కిందికి విసురుతున్నారు. ఆ తర్వాత వారంతా కిందికి దిగుతున్నారు. అదికూడా పైపుల ద్వారా బోగిపై నుంచి కిందికి వేలాడుతూ దిగుతున్నారు. వారిలో మహిళలు, పురుషులు కూడా ఉన్నారు.
ఇక చిన్న పిల్లలు అయితే.. బోగి గుమ్మంలో నిలుచున్న వ్యక్తి అందుకుంటున్నాడు. కింద నిలబడిన వారికి ఆ చిన్నారులను అందిస్తున్నారు. అప్పటికే రైలు దిగిన పిల్లలతోపాటు పెద్దలంతా తమ భారీ లగేజీలతో ఆ రైల్వే ట్రాక్ పక్కన నిలబడి.. తమ వారి కోసం ఎదురు చూస్తు్న్నారు. ఈ వీడియో భారత్ పొరుగునున్న బంగాదేశ్‌కు చెందిన వీడియో. ఈ వీడియోను ఘర్ కి కలాష్ ఎక్స్ పేజీలో షేర్ చేశారు. ఇప్పటికే ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు.
ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. చాలా మంది రైల్వే పరిపాలన ఘోర వైఫల్యానికి నిదర్శనమని అభివర్ణిస్తున్నారు. ఇది రైలు ప్రయాణమా? లేక పోల్ డ్యాన్సింగ్ పోటీనా? ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారని విమర్శిస్తున్నారు. ఏ మాత్రం పోల్ పైనుంచి ఒక్కరు జారిపడినా.. పెద్ద ప్రమాదం జరగవచ్చని నెటిజన్లు చెబుతున్నారు. ప్రయాణికులకు అనుగుణంగా.. జనరల్ బోగిలను పెంచాలని ప్రభుత్వాన్ని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.