బాలికలను వేధించిన నిందితులకు దురదగొండి శిక్ష.. వీడియో వైరల్
ABN , Publish Date - Aug 03 , 2026 | 07:19 AM
ఉత్తరాఖండ్‌లో బాలికలను వేధించారనే ఆరోపణలతో ఇద్దరు యువకులకు గ్రామస్తులు వినూత్నంగా గుణపాఠం చెప్పారు. ముఖానికి నల్లరంగూ పూసి, దురదగొండి ఆకు రుద్ది అనంతరం పోలీసులకు అప్పగించిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరాఖండ్‌లో బాలికలను వేధించారనే ఆరోపణలతో ఇద్దరు యువకులకు గ్రామస్థులు వినూత్నంగా గుణపాఠం చెప్పారు. ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లా ముక్తేశ్వర్ పరిధిలోని సటోలి గ్రామంలో స్థానిక బాలికలను వేధించారనే ఆరోపణలతో ఇద్దరు వ్యక్తులను గ్రామస్థులు బహిరంగంగా శిక్షించిన ఘటన సంచలనంగా మారింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందినవారిగా భావిస్తున్న ఇద్దరు వ్యక్తులు కారులో గ్రామం గుండా వెళ్తూ యువతులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి. సమాచారం అందుకున్న గ్రామస్థులు, మహిళలు వారిని అడ్డుకుని మందలించారు. ముఖానికి నల్లరంగు పూసి, హిమాలయ ప్రాంతంలో సహజంగా పెరిగే దురదగొండి మొక్కను వారి శరీరానికి రుద్దారు. ఈ మొక్క చర్మానికి తగిలితే తీవ్రమైన మంట, దురద కలుగుతుందని తెలిసిందే.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. అనంతరం గ్రామస్థులు ఆ ఇద్దరినీ స్థానిక పోలీసులకు అప్పగించగా, పోలీసులు కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు అవసరమని, నిందితులకు తక్షణమే గుణపాఠం చెప్పిన గ్రామస్తులను పలువురు ప్రశంసిస్తుండగా, మరికొందరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం కంటే పోలీసులకు ఫిర్యాదు చేయడం మంచిదని అభిప్రాయపడుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురి మృతి, 41 మంది గల్లంతు..
వాషింగ్టన్‌లో భారీ కార్చిచ్చు.. 2.5 లక్షల ఎకరాలు దగ్ధం..