పాక్ యుద్ధాన్ని ఆపింది నేనే.. ట్రంప్ నోట అదే మాట
ABN , Publish Date - Aug 01 , 2026 | 05:13 PM
భారత్ పాక్ యుద్ధాన్ని తాను ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చెప్పుకున్నారు. సుంకాలతో బెదిరించి యుద్ధాన్ని ఆపేలా చేశానని చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్ పాక్ యుద్ధాన్ని తాను ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చెప్పుకున్నారు. సుంకాలతో బెదిరించి యుద్ధాన్ని ఆపేలా చేశానని చెప్పారు. తాజా పత్రికా సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. తొలుత రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి ట్రంప్ ప్రస్తావించారు. యుద్ధం ముగించేలా డీల్ కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇప్పటికే తాను అనేక యుద్ధాలను ఆపానని చెప్పారు. అనంతరం భారత్-పాక్ యుద్ధం గురించి ప్రస్తావించారు.
‘భారత్-పాక్ యుద్ధానికి మేమే ఫుల్ స్టాప్ పెట్టాము. ఆ సమయంలో 11 యుద్ధ విమానాలు కూలిపోయాయి. యుద్ధం భీకరంగా ఉంది. వెంటనే నేను సుంకాల అంశాన్ని తెరపైకి తెచ్చా.. మీరు యుద్ధం చేస్తే 250 శాతం సుంకం విధిస్తానని అన్నాను. దీంతో, వాళ్లు గోల గోల చేశారు. ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుసటి రోజు మళ్లీ నాకు ఫోన్ చేసి యుద్ధం చేయమని చెప్పారు’ అని ట్రంప్ చెప్పుకొచ్చారు. యుద్ధం అడ్డుకుని 50 మిలియన్ల మంది ప్రాణాలు కాపాడారని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తనను ప్రశంసించారని ట్రంప్ చెప్పుకొచ్చారు.
ట్రంప్ గతంలో కూడా ఇలాంటి ప్రకటనలే చేశారు. అనేక సందర్భాల్లో భారత్ ఈ వాదనలను తోసిపుచ్చింది. పాక్‌తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ద్వైపాక్షిక అంశమని తేల్చి చెప్పింది. మరో దేశం జోక్యం లేనేలేదని స్పష్టం చేసింది. పలు ఫైటర్ జెట్స్ కూలిపోయాయన్న ట్రంప్ ప్రకటనను కూడా భారత్ గతంలోనే తోసిపుచ్చింది.
ఈ వార్తలనూ చదవండి:
వీసా బాండ్ విధానాన్ని కొనసాగించనున్న యూఎస్.. 20 వేల డాలర్ల వరకూ అదనపు భారం
స్పెయిన్ చేరినా ఆకలే.. వేలాది మంది మొరాకో వలసదారులు వెనక్కి..