వీసా బాండ్ విధానాన్ని కొనసాగించనున్న యూఎస్.. 20 వేల డాలర్ల వరకూ అదనపు భారం
ABN , Publish Date - Aug 01 , 2026 | 04:24 PM
వీసా బాండ్ విధానాన్ని కొనసాగించేందుకు అమెరికా విదేశాంగ శాఖ నిర్ణయించింది. ఆగస్టు 3 నుంచి కొత్త విధానం శాశ్వత ప్రాతిపదికన అమల్లోకి వస్తుందని పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: గతంలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన వీసా బాండ్ విధానాన్ని కొనసాగించేందుకు అమెరికా విదేశాంగ శాఖ నిర్ణయించింది. శాశ్వత ప్రాతిపదికన ఈ విధానాన్ని అమలు చేసేందుకు నిర్ణయించింది. గతంలో నిర్వహించిన పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో అమెరికా విదేశాంగ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
ఏమిటీ వీసా బాండ్ విధానం..
విజిటర్ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారు ముందుగా 15 వేల డాలర్ల వరకూ బాండ్ సమర్పించాలంటూ ఏడాది క్రితం అమెరికా ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని తీసుకొచ్చింది. బీ-1 (బిజినెస్), బీ-2 (టూరిస్ట్) వీసాలకు దరఖాస్తు చేసుకునే వారు ఈ బాండ్ సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు ఈ బాండ్ సమర్పించాలా? వాద్దా? అనేది కాన్సులార్ ఆఫీసర్లు నిర్ణయిస్తారు. వీసా గడువులోపు విదేశీయులు అమెరికాను వీడితే ఈ మొత్తాన్ని తిరిగిచ్చేస్తారు. లేకపోతే డబ్బును కోల్పోవాల్సి ఉంటుంది. అక్రమ వలసలను నిరోధించేందుకు అమెరికా ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా దరఖాస్తుదారులు 5 వేలు, 10 వేలు లేదా 15 వేల డాలర్ల బాండ్స్‌ను సమర్పించేవారు.
గరిష్ఠ బాండ్ పరిమితి పెంపు..
ప్రస్తుతం అమలు చేయనున్న విధానంలో మాత్రం 5 వేల బాండ్ ఆప్షన్‌ను అమెరికా తొలగించింది. అంతేకాకుండా, గరిష్ఠ బాండ్ పరిమితిని 20 వేల డాలర్లకు పెంచింది. ఏడాది పాటు పైలట్ ప్రాజెక్టు ఫలితాలను పరిశీలించిన అనంతరం ఈ విధానాన్ని శాశ్వతంగా కొనసాగించేందుకు అమెరికా విదేశాంగ శాఖ నిర్ణయించింది. ఆగస్టు 3 నుంచి ఇది అమల్లోకి రానుంది.
భారతీయులకు ఊరట..
మొత్తం 50 దేశాల వారికి ఈ బాండ్ విధానం వర్తిస్తుందని అమెరికా తెలిపింది. అయితే, ఈ జాబితాలో భారత్ లేకపోవడంతో ఇండియన్స్‌కు ఉపశమనం దక్కింది. అయితే, ఈ విధానాన్ని వలసదారుల హక్కుల కార్యకర్తలు, సంస్థలు మాత్రం విమర్శిస్తున్నాయి. బాండ్ భారంగా మారి అర్హులైన వారు అమెరికాకు దూరమయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
స్పెయిన్ చేరినా ఆకలే.. వేలాది మంది మొరాకో వలసదారులు వెనక్కి..
అణుబాంబు విస్ఫోటనం.. కొత్త లోహాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు..