అణుబాంబు విస్ఫోటనం.. కొత్త లోహాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు..
ABN , Publish Date - Aug 01 , 2026 | 12:09 PM
జపాన్‌లోని హిరోషిమాపై 1945లో జరిగిన అణుబాంబు దాడి మానవ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన ఘటనగా నిలిచింది. యుద్ధం నేపథ్యంలో హిరోషిమాపై అమెరికా ఈ దాడికి పాల్పడింది. అయితే, దాడి జరిగిన ఏళ్ల తర్వాత శాస్త్రవేత్తలు తాజాగా ఓ సంచలన విషయాన్ని కనిపెట్టారు.
న్యూఢిల్లీ: జపాన్‌లోని హిరోషిమాపై 1945లో జరిగిన అణుబాంబు దాడి మానవ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన ఘటనగా నిలిచింది. యుద్ధం నేపథ్యంలో హిరోషిమాపై అమెరికా ఈ దాడికి పాల్పడింది. అయితే, దాడి జరిగిన ఏళ్ల తర్వాత శాస్త్రవేత్తలు తాజాగా ఓ సంచలన విషయాన్ని కనిపెట్టారు. అణుబాంబు పేలుడుతో ఇప్పటివరకు భూమిపై సహజంగా కనిపించని ఓ కొత్త లోహ మిశ్రమాన్ని గుర్తించారు. అణు విస్ఫోటన సమయంలో ఏర్పడిన తీవ్ర పరిస్థితులు కొత్త రకాల పదార్థాల సృష్టికి దారితీస్తాయని ఈ ఆవిష్కరణ నిరూపించిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
పరిశోధనలో భాగంగా హిరోషిమా బే ప్రాంతంలోని ఇసుకలో భద్రపరిచిన చిన్న చిన్న గాజు బిందువులను (హిరోషిమైట్స్) శాస్త్రవేత్తలు పరిశీలించారు. అణుబాంబు పేలుడు సమయంలో భవనాలు, లోహాలు, నేల, గాజు, నీరు సుమారు 12 వేల డిగ్రీల ఫారెన్‌హీట్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతల్లో ఆవిరైపోయాయి. ఆ తర్వాత క్షణాల్లోనే చల్లబడటం వల్ల ఈ అవశేషాలు ఏర్పడ్డాయని పరిశోధకులు తెలిపారు. మొత్తం 34 హిరోషిమైట్ నమూనాలను శక్తిమంతమైన ఎక్స్-రే డిఫ్రాక్షన్ పద్ధతితో పాటు ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ సహాయంతో పరిశీలించిన శాస్త్రవేత్తలు.. వాటిలోని సూక్ష్మ లోహ కణాలను గుర్తించారు. అనంతరం వాటి నిర్మాణాన్ని విశ్లేషించారు.
సాధారణంగా కనిపించే ఇనుము-క్రోమియం మిశ్రమాలతో పాటు, ఓ చిన్న కణంలో ఇప్పటివరకు గుర్తించని ప్రత్యేకమైన లోహ నిర్మాణాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఇందులో ఇనుము, క్రోమియం, నికెల్, మాంగనీస్, మాలిబ్డెనం, సిలికాన్, అల్యూమినియం మూలకాలు ఉన్నాయి. అయితే, ఈ మూలకాలు కలిసిన విధానం సాధారణ మిశ్రమ లోహాల్లో కనిపించని ప్రత్యేక అణు నిర్మాణాన్ని కలిగి ఉందని పరిశోధకులు వెల్లడించారు. అణుబాంబు పేలుడు సమయంలో ఏర్పడిన లోహ ఆవిరి అత్యంత వేగంగా చల్లబడటం వల్ల ఈ కొత్త నిర్మాణం ఏర్పడిందని భావిస్తున్నారు. విపరీతమైన ఉష్ణోగ్రతలు, ఒత్తిడి వంటి మానవ నిర్మిత పరిస్థితులు ఇప్పటివరకు తెలియని పదార్థాలను సృష్టించగలవని ఈ అధ్యయనం సూచిస్తోందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
ఈ కొత్త లోహ మిశ్రమంపై మరింత పరిశోధన భవిష్యత్తులో తేలికైన, అధిక వేడిని తట్టుకునే పదార్థాల అభివృద్ధికి ఉపయోగపడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే అణుబాంబు విస్ఫోటనాల సమయంలో ఏర్పడే రసాయన, భౌతిక మార్పులను అర్థం చేసుకోవడంలో ఈ ఆవిష్కరణ కీలకంగా మారనుందని తెలిపారు. కాగా, 1945 ఆగస్టు 6న అమెరికా ‘లిటిల్ బాయ్’ అనే అణుబాంబును హిరోషిమాపై ప్రయోగించింది. దాదాపు 9 వేల పౌండ్ల బరువున్న ఈ బాంబు సుమారు 20 వేల టన్నుల టీఎన్‌టీ పేలుడు శక్తితో విధ్వంసం సృష్టించింది. ఈ దాడిలో దాదాపు 1.4 లక్షల మంది ప్రాణాలు కోల్పోగా.. రేడియేషన్ ప్రభావంతో అనేక మంది ప్రాణాంతక వ్యాధులకు గురయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి
అంత్యక్రియల్లో అవకతవకలు.. నిర్వాహకుడికి 20 ఏళ్ల జైలు..
శాండ్‌విచ్‌ను తుపాకీ ఆకారంలో కొరికాడని.. స్కూల్ నుంచి ఆరేళ్ల బాలుడి సస్పెన్షన్