రెండుసార్లు విమానం ల్యాండింగ్ ఫెయిల్.. గాల్లో తేలిన ప్రాణాలు.. వీడియో వైరల్
ABN , Publish Date - May 28 , 2026 | 03:38 PM
కొలంబియాలో ప్రయాణికులకు చుక్కలు చూపించిన ఓ భయానక విమాన ప్రయాణ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: కొలంబియాలో ప్రయాణికులకు చుక్కలు చూపించిన ఓ భయానక విమాన ప్రయాణ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ల్యాండింగ్ సమయంలో వాతావరణం అనుకూలించక విమానం గాల్లోనే చక్కర్లు కొట్టడంతో ప్రయాణికులు ప్రాణభయంతో వణికిపోయారు. మొత్తానికి ప్రమాదం అంచుల్లో నుంచి విమానం సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
కొలంబియా రాజధాని బొగోటా నుంచి పాస్టో నగరానికి ఓ ప్రయాణికుల విమానం బయలుదేరింది. పాస్టోలోని విమానాశ్రయం సముద్ర మట్టానికి దాదాపు 6వేల అడుగుల ఎత్తులో, పర్వత శిఖరాల మధ్య ఉంటుంది. విమానం రన్‌వేకు చేరువవుతున్న సమయంలో అక్కడ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దట్టమైన పొగమంచు కమ్ముకోవడం సహా బలమైన ఈదురు గాలులు వీయడం ప్రారంభమైంది. రన్‌వే సరిగ్గా కనిపించకపోవడంతో పైలట్ విమానాన్ని ల్యాండింగ్ చేయడానికి యత్నంచి విఫలమయ్యారు. విమానం ల్యాండ్ కాకుండా రెండుసార్లు ఫెయిల్ అవడంతో అందులో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భయంతో కొందరు గావుకేకలు పెట్టగా, మరికొందరు బోరున విలపించారు. పైలట్ విమానాన్ని తిరిగి బొగోటాకు తీసుకెళ్లారు. వాతావరణం కుదుటపడ్డాక ఆ విమానం పాస్టోలోని ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఈ ఘటనపై సదరు విమానయాన సంస్థ స్పందిస్తూ.. ప్రతికూల వాతావరణం కారణంగానే ఇలా జరిగిందని తెలిపింది. తమ ప్రాణాలను కాపాడిన పైలట్‌కు చప్పట్లతో కృతజ్ఞతలు తెలిపారు. ఈ భయానక దృశ్యాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి
ఇరాన్‌పై మరోసారి అమెరికా దాడులు.. సైనిక స్థావరమే టార్గెట్..
నకిలీ ట్రేడింగ్ యాప్‌తో సైబర్ మోసం