Share News

Never ask for AI chatbots: ఏఐ చాట్‌బాట్‌లను అడగకూడని 6 విషయాలివే..

ABN , Publish Date - Jan 04 , 2026 | 05:10 PM

ఆధునిక ప్రపంచంలో ఏఐ చాట్‌బాట్‌లు మానవ జీవితాన్ని వేగవంతం చేశాయి. రాయడం, నేర్చుకోవడం, ఏదైనా విషయాలను వేగంగా వెతకడంలో ఎంతో సాయపడతాయి. అయితే.. ప్రతీ దానికీ వాటినే ఫాలో అవడం మంచిది కాదు. అలా.. ఏఐ చాట్‌బాట్‌ను ఎప్పుడూ అడగకూడని కొన్ని అంశాలపై ప్రత్యేక కథనం.. మీ కోసం...

Never ask for AI chatbots: ఏఐ చాట్‌బాట్‌లను అడగకూడని 6 విషయాలివే..
AI Chatbot

ఇంటర్నెట్ డెస్క్: ఆధునిక ప్రపంచంలో ఏఐ చాట్‌బాట్‌ల వినియోగం బాగా పెరిగిపోయింది. టెక్నాలజీకి సంబంధించి ఏ విషయం కావాలన్నా వాటి ద్వారానే పొందుతున్నారు జనం. అయితే.. ఆ చాట్‌బాట్‌లనూ అడగకూడని అంశాలు కొన్ని ఉన్నాయి. వీటిని పొరపాటున కూడా ChatGPT, Grok, Gemini, ఏ ఇతర ఏఐ చాట్‌బాట్‌లనూ అడగకూడదు. అవేంటంటే...


మీ గోప్యత, భద్రత, మంచి నిర్ణయాలు తీసుకోవడం గురించి శ్రద్ధ వహిస్తూ.. ఏఐ చాట్‌బాట్‌లను అడగకూడని ఆ ఆరు విషయాలు ఏమిటంటే...

1. వైద్య సలహా లేదా చికిత్స

ఎలాంటి ఏఐ చాట్‌బాట్‌లూ వైద్యులు కాదు. అవి కచ్చితమైన వైద్య పరిభాషా పదాలను వివరించలేవు. మీ ఆరోగ్య లక్షణాన్ని బట్టి అది మీకు సరైన చికిత్స అందించలేదు. ఏ వ్యాధికి ఎలా చికిత్స చేయాలో ఏఐ సూచించలేదు. మందుల సలహా లేదా వ్యాధి నిర్ధారణ కోసం ఏఐపై ఆధారపడితే.. దాని ద్వారా హాని కలిగించే ప్రమాదం ఉంది. కాబట్టి.. సాధారణ ఆరోగ్య సమాచారానికి కట్టుబడి ఉండటం ఉత్తమం. ఎలాంటి జబ్బు వచ్చినా వైద్యులను సంప్రదించడమే మంచిది.

2. వ్యక్తిగత, ఆర్థిక సమాచారం

వ్యక్తిగత బ్యాంక్ వివరాలు, ఆధార్, పాన్ నంబర్లు, పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు, ఆఫీస్ డాక్యుమెంట్లు లేదా ఏదైనా ప్రైవేట్ ఫైల్‌ల వివరాలను చాట్‌బాట్‌లో ఎప్పుడూ టైప్ చేయరాదు. ఇలా వ్యక్తిగత వివరాలను పంచుకోవడం వల్ల గోప్యతా సంబంధిత అంశాలు బహిర్గతం కావడం, మోసానికి పాల్పడటం వంటి వాటికి దారితీస్తుంది. ప్రస్తుతం.. దేశంలో ఈ సమస్య రోజు రోజుకూ అధికమవుతోంది.

3. చట్టవిరుద్ధమైన సలహాలు

హ్యాకింగ్, పైరసీ, మోసం, పన్నుల ఎగవేత, చట్టం నుంచి తప్పించుకోవడం వంటి వాటి కోసం ఏఐ చాట్‌బాట్‌లను ఎప్పటికీ వాడరాదు. ఇలాంటి విషయాల్లో ఇవి ప్రత్యేక నియమాలను కలిగి ఉంటాయి. కాబట్టి ఏ విధంగానూ సాయపడవు. అలా చట్టవిరుద్ధమైన సలహాలను పొందే ప్రయత్నాలు చేయడం వల్ల లేనిపోని చిక్కుల్లో పడే అవకాశముంది.

4. అదే పూర్తి వాస్తవం కాదు

చాట్‌బాట్‌లు వాస్తవ విషయాలను పసిగట్టలేవు. అవి కేవలం డేటాలోని నమూనాల ఆధారంగా పనిచేస్తాయి. వాటిల్లో కొన్నిసార్లు తప్పులూ ఉంటాయి, మరి కొన్నిసార్లు పాత సమాచారం చేరవేస్తాయి. ఉదాహరణకు ఏదైనా చట్టపరమైన సలహా, ఆర్థికపరమైన అంశాల కోసం ఏఐని నమ్మితే అది తప్పు మార్గాన్ని సూచించే అవకాశముంది. కాబట్టి అధికారిక సమాచారంతో ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకోవడం ఉత్తమం.

5. అనుకూల తీర్పును ఆశించి..

ఏఐ చాట్‌బాట్‌ను.. 'నేను ఉద్యోగాన్ని వదులుకోవాలా లేదా వ్యాపారం చేస్తే బావుంటుందా?' వంటి ప్రశ్నలకు ఏఐ అభిప్రాయాలను అనుసరించవద్దు. ఎందుకంటే వాటికి మన వ్యక్తిగత అభిప్రాయాలు తెలియవు. కాబట్టి సరైన తీర్పును వెలువరించలేవు. అలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు.. ఎవరైనా మార్గదర్శకులు లేదా నిపుణులతో మాట్లాడటం శ్రేయస్కరం.

6. భావోద్వేగాల విషయంలో..

ఏఐకి సానుభూతి ఉందని అనిపించవచ్చు.. కానీ నిజం కాదు. అది మన సంభాషణకు తగినట్టుగా అన్ని భావోద్వేగాలను అర్థం చేసుకోలేదు. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మద్దతు కోసం.. సన్నిహితులతో మాట్లాడటానికి మించినదేదీ లేదని గమనించాలి.

అంతిమంగా.. ఏఐ చాట్‌బాట్‌లు కేవలం సహాయకారిగా మాత్రమే పనిచేస్తాయి. వాటికీ స్పష్టమైన పరిమితులు ఉన్నాయి. కాబట్టి వాటిని అవసరమైన మేరకు మాత్రమే తెలివిగా ఉపయోగించాలి. అలా చేస్తేనే వాటి నుంచి ఉత్తమమైన ప్రయోజనాలను పొందవచ్చు.


ఇవీ చదవండి:

క్వారీలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి

ఎలక్ట్రిక్ గీజర్ వాడుతున్నారా? ఈ సంకేతం వస్తే జాగ్రత్త సుమీ.!

Updated Date - Jan 04 , 2026 | 06:46 PM