Volcanic Eruption at Odisha: క్వారీలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి
ABN , Publish Date - Jan 04 , 2026 | 12:23 PM
ఒడిశాలో భారీ ప్రమాదం సంభవించింది. ఓ క్వారీలో మైనింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తుండగా పెద్దఎత్తున పేలుడు సంభవించడంతో ఇద్దరు మృతిచెందారు.
ఇంటర్నెట్ డెస్క్: ఒడిశాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ధెంకనాల్ జిల్లాలోని ఓ క్వారీలో భారీ పేలుడు సంభవించడంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు(Volcanic Eruption at Odisha). ఈ ఘటనలో పలువురు కార్మికులు గాయపడి శిథిలాల కింద చిక్కుకున్నారు. వీరిని రక్షించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
మోతంగా(Motanga) పీఎస్ పరిధిలోని గోపాల్‌పూర్ గ్రామ సమీపంలో ఓ రాతి క్వారీలో శనివారం రాత్రి కార్మికులు.. డ్రిల్లింగ్, మైనింగ్ పనులు చేస్తున్న సమయంలో భారీ పేలుడు సంభవించింది. దీంతో అక్కడి కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సహా ఒడిశా డిజాస్టర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్(ODRAF) బృందాలు, డాగ్ స్క్వాడ్(Dog Squad) అక్కడకు చేరుకున్నాయి. భారీ శిథిలాల మధ్య చిక్కుకున్న పలువురిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. ఆధునిక యంత్రాల సాయంతో వారిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు.. ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న అధికారులు.. ప్రజలెవరూ అటువైపు రాకుండా పోలీస్ సిబ్బంది గస్తీ కాస్తున్నారు.
ఇక.. ధెంకనల్ జిల్లా కలెక్టర్ ఆశిష్ ఈశ్వర్ పాటిల్ సహా ఎస్పీ అభినవ్ సోంకర్‌లు ఘటనా స్థలంలోనే ఉంటూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. పేలుడు కారణంగానే కొండచరియలు విరిగిపడ్డాయని స్థానికులు చెబుతున్నా.. అసలు కారణాలను తెలుసుకునే దిశగా దర్యాప్తు చేపట్టినట్టు వారు తెలిపారు.
అయితే.. పేలుడు జరిగిన ప్రాంతంలో అక్రమంగా మైనింగ్ నిర్వహించడం చర్చనీయాంశమైంది. వాస్తవానికి ఈ ప్రాంతంలో బ్లాస్టింగ్‌కు అనుమతి లేదని పేర్కొంటూ లీజుదారునికి 2025 సెప్టెంబర్ 8న ఉత్తర్వులు జారీ అయ్యాయని తెలుస్తోంది. అయినప్పటికీ.. నిబంధనలను ఉల్లంఘించి అక్కడ బ్లాస్టింగ్ కొనసాగించారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: