Power Banks Barred by DGCA: విమానాల్లో పవర్ బ్యాంక్‌లపై నిబంధనలు కఠినతరం.. కారణమిదే..
ABN , Publish Date - Jan 04 , 2026 | 04:24 PM
కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విమాన ప్రయాణాల్లో పవర్ బ్యాంకులు, లిథియం బ్యాటరీలున్న పరికరాలపై నిబంధనల్ని కఠినతరం చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది డీజీసీఏ.
ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విమాన ప్రయాణాల్లో పవర్ బ్యాంకులు సహా లిథియం బ్యాటరీతో నడిచే పరికరాలు క్యారీ చేయడంపై నిబంధనల్ని మరింత కఠినతరం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఇటీవల లిథియం బ్యాటరీలు వేడెక్కడం ఆపై పేలిపోతున్న ఘటనలు సంభవిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA). విమానంలో పవర్ బ్యాంకులను ఛార్జ్ చేయడం, వాటిని ఇన్-సీట్ పవర్ సిస్టమ్‌లతో ఉపయోగించడాన్ని నిషేధించింది. అంటే ఇకపై వీటిని ప్రత్యేక లగేజీలో కాకుండా.. మనమే క్యారీ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు ప్రయాణికులు తమ పవర్ బ్యాంక్‌లను ఎయిర్‌లైన్స్‌లో ఛార్జ్ చేసుకోవడంపైనా నిషేధం విధిస్తున్నట్టు డీజీసీఏ పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా పలు విమానాలలో లిథియం బ్యాటరీలను భద్రతా ప్రమాదాలకు కారణంగా అనుమానిస్తున్న ఘటనలు పెరిగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు డీజీసీఏ తెలిపింది. కొత్త నిబంధనల ప్రకారం.. లిథియం బ్యాటరీలు కలగిన పోర్టబుల్ పరికరాలు, పవర్ బ్యాంకులపై విమానయాన సంస్థకు నివేదించాలని డీజీసీఏ పేర్కొంది. ఏదైనా పరికరం వేడెక్కడం, పొగలు కక్కడం, ప్రత్యేకమైన వాసన వెదజల్లడం వంటి లక్షణాలు ఉంటే సదరు వస్తువుపై సిబ్బందికి సమాచారం అందించాలని ఆదేశించింది.
లిథియం బ్యాటరీలపై ఆందోళన ఎందుకంటే.?
లిథియం బ్యాటరీల ద్వారా చెలరేగే మంటలు అత్యంత ప్రమాదకరమైనవి. అవి అధిక శక్తిని కలిగి ఉంటాయి కనుక నియంత్రించడం కష్టతరమైన పని. పునరుద్ధరించబడిన వివిధ వస్తువుల్లో లిథియం బ్యాటరీలను విస్తృతంగా ఉపయోగించడం వల్ల ఇటీవల విమానాల్లో వాటి రవాణా విపరీతంగా పెరిగిపోయింది. పవర్ బ్యాంకులు, పోర్టబుల్ ఛార్జర్లు, లిథియం బ్యాటరీలు కలిగి ఉన్న పరికరాలు చాలా ప్రమాదకరమైనవి. వీటివల్ల ఎప్పుడు ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందో తెలియని పరిస్థితి. ఇలాంటి బ్యాటరీలను విమానంలో ఎక్కడ నిల్వచేసినా ప్రమాదకరమేనని నియంత్రణ సంస్థ తెలిపింది. క్యారీ ఆన్ బ్యాగేజీలో చేర్చిన లిథియం బ్యాటరీలను యాక్సెస్ చేయడం కష్టమైన పని. వాటిని ప్రయాణికులు, సిబ్బంది వెంటనే పర్యవేక్షించకపోవచ్చు. ఫలితంగా తీవ్ర దుష్పరిణామాలకు దారితీసే అవకాశముంది.
లిథియం బ్యాటరీల ద్వారా చెలరేగిన మంటల్ని సాధారణ అగ్నిలా అదుపు చేయలేమని విమానయాన అధికారులు తెలిపారు. ఇవి వేడెక్కడం, ఓవర్ ఛార్జింగ్, క్రషింగ్ లేదా నాణ్యతలేని కారణంగా అంతర్గత షార్ట్ సర్క్యూట్ జరగడం, బ్యాటరీలు పాతవి కావడం లేదా నిర్వహణ సౌలభ్యం సక్రమంగా లేకపోవడం వంటి వాటి ద్వారా ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వారు పేర్కొన్నారు.
మారిన నియమ నిబంధనలపై ప్రయాణికుల్లో విస్తృత అవగాహన కల్పించడంపై డీజీసీఏ దృష్టి సారించింది. కొత్త భద్రతా నియమాలపై విమానయాన ప్రకటనల ద్వారా ఎప్పటికప్పుడు ప్రయాణికులకు సమాచారం చేరవేయాలని ఆదేశాలు జారీ చేసింది. తాము క్యారీ చేసే పరికరాల్లో వేడి, పొగ లేదా భిన్నమైన వాసన వెదజల్లినప్పుడు ప్రయాణికులు వెంటనే క్యాబిన్ సిబ్బందికి తెలియజేయాలని సూచించింది. అయితే.. విమానయాన సంస్థలు లిథియం బ్యాటరీ ప్రమాదాలకు సంబంధించిన అన్ని భద్రతా సమస్యలు, సంఘటనలను డీజీసీఏకు వెంటనే నివేదించాలని స్పష్టం చేసింది.
కాగా.. గతేడాది అక్టోబర్‌లో ఢిల్లీ విమానాశ్రయంలో డియాపూర్ వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడి పవర్ బ్యాంక్ పేలిన సంగతి తెలిసిందే. అయితే.. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అంతా సురక్షితంగా బయటపడ్డారు.
ఇవీ చదవండి: