లైవ్ షోలో డ్రోన్‌ను తన్నిన హోస్ట్.. మోడల్‌కు గాయం.. వీడియో వైరల్
ABN , Publish Date - Oct 29 , 2026 | 10:54 AM
మెక్సికోలో ఓ టీవీ షో ప్రత్యక్ష ప్రసారం సందర్భంగా అనూహ్య ఘటన చోటుచేసుకుంది. హోస్ట్ ఎర్నెస్టో చవానా స్టూడియోలో ఉన్న డ్రోన్‌ను తన్నడంతో అది ఎగిరి మోడల్ ఇసాబెల్లా రోజాస్ ముఖానికి తగిలింది. ఈ ఘటనలో ఆమె పెదవికి గాయమైంది.
ఇంటర్నెట్ డెస్క్: మెక్సికోలోని మాంటెర్రేలో అక్టోబర్ 26న ‘ఈఎస్ షో’ ప్రత్యక్ష ప్రసారం సందర్భంగా అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. వినోద కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఎర్నెస్టో చవానా స్టూడియోలో నేలపై తక్కువ ఎత్తులో ఎగురుతున్న చిన్న డ్రోన్‌ను కాలితో బలంగా తన్నాడు. దీంతో ఆ డ్రోన్ వేగంగా దూసుకెళ్లి.. అక్కడే ఉన్న మోడల్ ఇసాబెల్లా రోజాస్ ముఖానికి తగిలింది.
ఈ ఘటన మల్టీమీడియోస్ కెనాల్ 6లో ప్రసారమవుతున్న సమయంలో జరిగింది. డ్రోన్ ముఖానికి తగలడంతో రోజాస్ నొప్పితో ఇబ్బందిపడుతూ వెంటనే చేతులతో ముఖాన్ని కప్పుకొంది. వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి పరిస్థితిని గమనించారు. ఈ అనూహ్య పరిణామంతో ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం ఒక్కసారిగా ఆందోళనకరంగా మారింది. ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
ఈ ప్రమాదంలో ఇసాబెల్లా రోజాస్ పై పెదవికి గాయమైనట్లు సమాచారం. ఆ తర్వాత తన గాయాన్ని చూపిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో అప్డేట్ ఇచ్చి.. తాను బాగానే ఉన్నానని అభిమానులకు భరోసా ఇచ్చింది. మరోవైపు.. ఈ ఘటనపై కార్యక్రమాన్ని ప్రసారం చేసిన మల్టీమీడియోస్ సంస్థ కూడా స్పందించింది. రోజాస్ క్షేమంగానే ఉన్నారని వెల్లడించినట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించి ఎర్నెస్టో చవానా క్షమాపణలు చెప్పడంతో పాటు.. ఆమె వైద్య ఖర్చులను భరించేందుకు అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి.
ఈ ఘటనపై సోషల్ మీడియాలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘మోడల్స్ అంటే అంత నిర్లక్ష్యమా? అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ‘ఆ డ్రోన్ ఇరిటేషన్ చేయడం వల్లే అలా తన్ని ఉంటాడు’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ‘ఇకపై ఆ మోడల్ హూస్ట్ కి కిలో మీటర్ దూరంలో నిలబడుతుంది’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
అప్రాధాన్య పోస్టుకు జయేశ్ రంజన్
ఆ జూనియర్ లెక్చరర్లను సర్వీసులోకి తీసుకోండి
Read Latest AP News And Telangana News