High Speed Police Chase: కుంగ్‌ఫూ డాగ్.. కారు లోపలి నుంచి గాల్లోకి ఎగిరి..
ABN , Publish Date - Jan 13 , 2026 | 11:14 AM
అనుమానితుడి కారు ప్రమాదానికి గురైంది. రోడ్డు పక్క ఉన్న దిమ్మెను ఢీకొట్టి ఠక్కున ఆగిపోయింది. కారు ముందు భాగం ధ్వంసమైంది. ఇలాంటి సమయంలో ఎవరూ ఊహించని సంఘటన చోటుచేసుకుంది.
అమెరికాలో హాలీవుడ్ యాక్షన్ సినిమాను తలపించే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. రొటీన్ ట్రాఫిక్ చెకింగ్ సందర్భంగా డేంజరస్ ఛేజింగ్ చోటుచేసుకుంది. ఛేజింగ్ సందర్భంగా ఓ కారు ప్రమాదానికి గురైంది. ఆ కారులో ఉన్న కుక్క కుంగ్‌ఫూ కుక్కగా మారిపోయింది. విండ్‌షీల్డ్ లోనుంచి ఠక్కున గాల్లోకి లేచి కిందకు దూకింది. చిన్న గాయం కూడా కాకుండా ప్రమాదం నుంచి తప్పించుకుని పారిపోయింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. జనవరి 6వ తేదీన అర్థరాత్రి వాషింగ్టన్‌లోని పియర్స్ కౌంటీ ట్రాఫిక్ పోలీసులు రొటీన్ ట్రాఫిక్ చెకింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ కారు ట్రాఫిక్ పోలీసులు ఉన్న వైపు వచ్చింది.
పోలీసులు ఆ కారును ఆపే ప్రయత్నం చేశారు. కారు నడుపుతున్న వ్యక్తి ట్రాఫిక్ పోలీసులను చూడగానే కారు స్పీడు పెంచాడు. వేగంగా అక్కడినుంచి దూసుకెళ్లాడు. పోలీసులకు అతడిపై అనుమానం వచ్చింది. వెంటనే తమ కారుతో ఆ కారును ఛేజ్ చేయటం మొదలెట్టారు. హాలీవుడ్ సినిమాను తలపించేలా రెండు కార్లకు మధ్య ఛేజింగ్ నడిచింది. కొన్ని కిలోమీటర్లు పోయిన తర్వాత అనుమానితుడి కారు ప్రమాదానికి గురైంది. రోడ్డు పక్క ఉన్న దిమ్మెను ఢీకొట్టి ఠక్కున ఆగిపోయింది. కారు ముందు భాగం ధ్వంసమైంది. ఇలాంటి సమయంలో ఎవరూ ఊహించని ఘటన చోటుచేసుకుంది. కారు విండ్‌షీల్డ్ లోపలి నుంచి ఓ కుక్క ఠక్కున గాల్లోకి లేచి.. రోడ్డు మీదకు దూకింది.
ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అక్కడినుంచి పారిపోయింది. అంత పెద్ద ప్రమాదం జరిగినా కూడా ఆ కుక్కకు చిన్న గాయం కూడా కాలేదు. పోలీసులు ఆ కారును నడిపిన వ్యక్తిని, అతడితో పాటు ఉన్న అమ్మాయిని అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరూ డ్రగ్స్ తీసుకుని కారులో ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. కారు నడిపిన వ్యక్తిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇద్దరినీ స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కుక్క స్టంట్‌ను చూసిన జనం ఆశ్చర్యపోతున్నారు. కుంగ్‌ఫూ కుక్క అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఇది మేము ఆశించిన ఆరంభం కాదు.. యూపీ వారియర్స్ కెప్టెన్ అసహనం
వామ్మో.. ఆవుకు అంత పవర్ ఉందా.. చిరుతతో ఎలా పోరాడిందో చూడండి..