మంటలు చుట్టుముట్టినా వెనక్కి తగ్గలేదు.. మహిళను కాపాడిన రియల్ హీరో
ABN , Publish Date - Nov 08 , 2026 | 06:59 PM
అగ్నిప్రమాదం అంటేనే భయంతో పరుగులు తీసే పరిస్థితి. అలాంటి ప్రమాదంలో తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఓ మహిళను కాపాడేందుకు ముందుకొచ్చాడు ఓ వ్యక్తి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది..
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలోని సాకేత్ ప్రాంతంలో ఓ షోరూమ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భవనమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. దీంతో లోపల ఉన్నవారు ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలో ఓ మహిళ భవనంలో చిక్కుకుపోయింది. బయటకు వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో ఆమె తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి ఆమెను ఎలాగైనా సురక్షితంగా బయటకు తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. మంటలు వ్యాపిస్తున్నా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా మహిళను తన వీపుపై ఎక్కించుకున్నాడు. అనంతరం నిచ్చెన తరహాలో ఏర్పాటు చేసిన మార్గం ద్వారా ఒక భవనం పైకప్పు నుంచి మరో పైకప్పుపైకి జాగ్రత్తగా తీసుకెళ్లాడు. ప్రతి అడుగూ ఆచితూచి వేస్తూ చివరకు ఆమెను సురక్షిత ప్రాంతానికి చేర్చాడు.
ఈ సాహసోపేత ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మంటల మధ్య మహిళను వీపుపై మోసుకెళ్తున్న దృశ్యాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా ఇలాంటి ప్రమాదాలు ఎదురైనప్పుడు ఎవరికి వారు ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఈ వ్యక్తి మాత్రం తన భద్రతను పక్కనపెట్టి మరో ప్రాణాన్ని కాపాడేందుకు ముందుకు రావడం పలువురి ప్రశంసలు అందుకుంటోంది. క్లిష్ట సమయంలో చూపిన ధైర్యం, సమయస్ఫూర్తి నిజంగా అభినందనీయమంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన మానవత్వమని, అతడి సాహసం అందరికీ ఆదర్శమని కొనియాడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నవంబరు 9 నాటికి పంట నష్టం అంచనాలు పూర్తి చేయాలి.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి
జగన్ చొక్కామడతా పెడతామంటే భయపడే పరిస్థితుల్లో ప్రజలు లేరు: పల్లా శ్రీనివాసరావు