ఫైవ్‌స్టార్ హోటళ్లలో బిల్లు చెల్లించకుండా ఉడాయిస్తూ.. చివరకు!
ABN , Publish Date - Jul 09 , 2026 | 05:32 PM
ఫైవ్ స్టార్ హోటళ్లలో దిగుతాడు. కొన్ని రోజులపాటు ఉండి బిల్లు చెల్లించకుండా ఉడాయిస్తాడు. ఆయా హోటళ్లలోని ఖరీదైన వస్తువులనూ తనతో పట్టుకుపోతుంటాడు. ఒకటి కాదు, రెండు కాదు.. మూడు దశాబ్దాలలో ఏకంగా 300 సార్లు ఇలా చేశాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. వివరాల్లొకెళితే...
ఇంటర్నెట్ డెస్క్: ఫైవ్ స్టార్ హోటళ్లలో దిగుతాడు. కొన్ని రోజులపాటు ఉండి బిల్లు చెల్లించకుండా ఉడాయిస్తాడు. ఆయా హోటళ్లలోని ఖరీదైన వస్తువులనూ తనతో పట్టుకుపోతుంటాడు. ఒకటి కాదు, రెండు కాదు.. మూడు దశాబ్దాలలో ఏకంగా 300 సార్లు ఇలా చేశాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. విచారణలో అతడు కీలక విషయాలు వెల్లడించిన అతడి పేరు బింగ్‌సన్ జాన్. 69 ఏళ్ల వయసులో ఆ వృద్ధుడు చేసిన పనిని చూస్తే.. 'ముసలోడే కానీ.. మహానుభావుడు' అనిపించక మానదు.
తమిళనాడుకు చెందిన బింగ్‌సన్ జాన్.. గతంలో తీహార్ జైలుకు వెళ్లినప్పుడు సీరియల్ కిల్లర్, మోసగాడు ఛార్లెస్ శోభ్‌రాజ్‌ను చూసి స్ఫూర్తిపొందానని తెలిపాడు. అందుకే ఆయన్ను ఫాలో అయినట్లు చెప్పాడు. విలాసవంతమైన హోటళ్లలో చెక్‌ఇన్ సమయంలో ఎంతో మర్యాదైన అతిథిలా వ్యవహరించడం అతడి అలావాటు. ఆ ప్రవర్తన సిబ్బందిని విపరీతంగా ఆకట్టుకుంటుంది. దీంతో ముందుగా అడ్వాన్స్ చెల్లించాలని ఏమాత్రం ఒత్తిడి చేయకుండా అతడికి వసతి కల్పిస్తారు.
విదేశీ పర్యాటక గైడ్, ఆంగ్ల ఉపాధ్యాయుడు, యోగా శిక్షకుడినంటూ నకిలీ ధ్రువపత్రాలతో ఫైవ్‌స్టార్ హోటళ్లలో దిగుతుంటాడు జాన్. అలా.. ఇటీవల ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లోని ఓ హోటల్‌లో దిగాడు. రెండు రోజులపాటు అక్కడే ఉన్నాడు. అందుకు రూ.63,755 ఛార్జ్ చేసింది హోటల్ యాజమాన్యం. ఆ నగదు చెల్లించకుండానే అక్కడి నుంచి ఉడాయించాడు జాన్. అంతేకాకుండా ఆఫీస్ పని కోసం తీసుకున్న రూ.1.48 లక్షల విలువైన ల్యాప్‌ట్యాప్‌నూ పట్టుకెళ్లాడు. దీంతో హోటల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బింగ్‌సన్ కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. ఎట్టకేలకు ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి ల్యాప్‌టాప్‌నూ స్వాధీనం చేసుకున్నారు. 1990 నుంచి దేశవ్యాప్తంగా ఇలా సుమారు 300కు పైగా విలాసవంతమైన హోటళ్లలో వసతి పొంది, ఇలాగే మోసగించినట్టు తేలింది.
చిన్నతనంలో ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న బింగ్‌సన్.. 1980 నుంచి న్యూఢిల్లీలో టూరిస్ట్ గైడ్‌గా పని చేశాడు. ఈ నేపథ్యంలో పెద్ద పెద్ద హోటళ్లకు పర్యాటకులతో కలిసివెళ్లేవాడు. దీంతో అతడిని హోటల్ సిబ్బంది బిల్లు చెల్లించాలని అడిగేవారు కాదు. అయితే.. ఓసారి ఫైవ్ స్టార్ హోటల్‌లో సిబ్బంది అతడిని అవమానించారు. దీంతో విలాసవంతమైన హోటళ్లను లక్ష్యంగా చేసుకోవాలని జాన్ నిర్ణయించుకున్నాడు. నాటి నుంచి అలా మోసాలకు పాల్పడుతూ చివరకు మరోసారి ఇలా పోలీసులకు దొరికిపోయాడు.
ఇవి కూడా చదవండి..
కాలు లేకున్నా.. ఆత్మవిశ్వాసం కోల్పోలేదు.. వీడియో వైరల్
లోకో పైలట్ సమోసాల కొనుగోలు వీడియోపై స్పందించిన రైల్వే శాఖ
For More Viral News And Telugu News