Share News

లోకో పైలట్ సమోసాల కొనుగోలు వీడియోపై స్పందించిన రైల్వే శాఖ

ABN , Publish Date - Jul 08 , 2026 | 06:12 PM

మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో ప్రయాణికుల రైలును నిలిపివేసి.. లోకో పైలట్ సమోసాలు కొన్నారంటూ వైరల్ అవుతున్న వీడియోపై రైల్వే శాఖ స్పందించింది. ఈ ప్రచారాన్ని ఖండించింది.

లోకో పైలట్ సమోసాల కొనుగోలు వీడియోపై స్పందించిన రైల్వే శాఖ

ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో ప్రయాణికుల రైలును నిలిపివేసి.. లోకో పైలట్ సమోసాలు కొన్నారంటూ వైరల్ అవుతున్న వీడియోపై రైల్వే శాఖ స్పందించింది. ఈ ప్రచారాన్ని ఖండించింది. అందులో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఈ వీడియో ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని తెలిపింది. వీడియోలో వైరల్ అవుతున్న రైలు ఇంజనీరింగ్ పనుల కోసం నిలిపి ఉంచిందని వివరించింది. దానికి ఇండోర్- డీఈఎంయూ ప్యాసింజర్ సర్వీస్‌తో ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. ఈ మేరకు బుధవారం పశ్చిమ రైల్వే ఎక్స్ వేదికగా వెల్లడించింది.


వైరల్ అవుతున్న క్లిప్‌లో చూపించిన రైలు, కాంకోర్ గ్రీన్ ఫీల్డ్ ప్రైవేట్ టెర్మినస్‌కు చెందిన గూడ్స్ రైలు అని తెలిపింది. దీనిని 27237, 27600 నంబర్ల లోకోమోటీవ్‌లు లాగుతున్నాయని వివరించింది. రౌ యార్డులో షెడ్యూల్ ప్రకారం ఇంజనీరింగ్, నిర్వహణ పనులు జరుగుతున్నందున.. ఆ రైలును ఇందౌర్ సమీపంలోని రౌ హోమ్ సిగ్నల్ వద్ద అప్పటికే నిలిపివేసినట్లు పశ్చిమ రైల్వే స్పష్టం చేసింది.


అధికారికంగా అనుమతించిన చోటే రైలు ఆగిందని పేర్కొంది. అసిస్టెంట్ లోకో పైలట్.. దగ్గరలోని దుకాణానికి వెళ్లి సమోసాలు, కచోరీలు కొనడానికి రైలు దిగారని తెలిపింది. సిబ్బంది ఆహారం కొనుక్కోవడానికి వీలుగా దానిని ఆపలేదని పశ్చిమ రైల్వే స్పష్టం చేసింది.


అయితే రైలును ఆపి.. లోకో పైలట్ సమోసాలు కొన్నారంటూ వీడియో వైరల్‌పై ప్రజలు నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. రైల్వే భద్రతాతోపాటు సిబ్బంది వైఖరిపై ఈ సందర్భంగా పలు ప్రశ్నలు సంధించారు. తప్పుదారి పట్టించే కథనాన్ని సృష్టించడానికి ఆ వీడియోను ఎంపిక చేసిన భాగాలతో ఎడిట్ చేసి, ఉద్దేశపూర్వకంగా వక్రీకరించారని పశ్చిమ రైల్వే తెలిపింది.


ధ్రువీకరించని సోషల్ మీడియా కంటెంట్‌పై ఆధారపడవద్దని ప్రజలకు సూచించింది. ఆన్‌లైన్‌లో సమాచారాన్ని పంచుకునే ముందు అధికారికంగా దాన్ని ధ్రువీకరించుకోవాలని ప్రజలను పశ్చిమ రైల్వే కోరింది.


ఇవి కూడా చదవండి..

సెల్‌ఫోన్ ఫ్లాష్ లైట్ వెలుగులో రైల్వేట్రాక్‌‌పై ప్రయాణికుల నడక.. వీడియో వైరల్

రూ.15 విలువైన ఆర్డర్‌కు రూ.500 టిప్పు.. డెలివరీ బాయ్ రియాక్షన్ వీడియో వైరల్

For More Viral News And Telugu News

Updated Date - Jul 08 , 2026 | 07:00 PM