Share News

నాలుగేళ్లకే అద్భుతం.. 3 వేల పుస్తకాలు చదివిన అర్జున్

ABN , Publish Date - Oct 24 , 2026 | 10:03 AM

పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని అంటారు. అదే విషయం అర్జున్ ప్రజాపతి విషయంలో రుజువైంది. కేవలం 18 నెలల వయస్సులోనే చదవడం ప్రారంభించాడు ఆ బాలుడు. ఆ వయస్సులో పిల్లలంతా హ్యారీ పోటర్, షెర్లాక్ హోమ్స్ వంటి కల్పిత పాత్రలు ఉన్న పుస్తకాలను అమితంగా ఇష్టపడతారు. కానీ అతడు మాత్రం మానవ శరీర ధర్మ శాస్త్రం, గణితం, ఖగోళశాస్త్రం, ప్రాచీన నాగరికతపై అమితాసక్తి పెంచుకున్నాడు.

నాలుగేళ్లకే అద్భుతం.. 3 వేల పుస్తకాలు చదివిన అర్జున్

ఇంటర్నెట్ డెస్క్: పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని అంటారు. అదే విషయం అర్జున్ ప్రజాపతి విషయంలో రుజువైంది. కేవలం 18 నెలల వయస్సులోనే చదవడం ప్రారంభించాడు ఆ బాలుడు. ఆ వయస్సులో పిల్లలంతా హ్యారీ పోటర్, షెర్లాక్ హోమ్స్ వంటి కల్పిత పాత్రలు ఉన్న పుస్తకాలను అమితంగా ఇష్టపడతారు. కానీ అతడు మాత్రం మానవ శరీర ధర్మ శాస్త్రం, గణితం, ఖగోళశాస్త్రం, ప్రాచీన నాగరికతపై అమితాసక్తి పెంచుకున్నాడు.

తద్వారా నాలుగేళ్ల వయస్సులో 141 ఐక్యూ స్కోరు సాధించి.. స్టాండర్డైజ్‌డ్ కాగ్నేటివ్ అసెస్‌మెంట్‌(standardised cognitive assessment) లో 99.7 పర్సంటైల్‌లో నిలిచాడు. అర్జున్‌ మేధస్సుపై కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ ప్రశంసలు కురిపిస్తూ లేఖ రాశారు. అంతేకాకుండా అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఐక్యూ సంఘాలు మెన్సా, ఇంటర్‌టెల్‌లలో సభ్యత్వానికి ఆ బాల మేథావి అర్హత సంపాదించాడు.


కెనడాలో స్థిరపడిన గుజరాత్‌లోని వడోదరాకు చెందిన దంపతులకు అర్జున్ ప్రజాపతి జన్మించాడు. అర్జున్ ఇప్పటికే 3 వేల పుస్తకాలు చదివాడని అతడి తల్లిదండ్రులు వెల్లడించారు. అర్జున్‌కు చిన్ననాటి నుంచే నేర్చుకోవడంపై ఆసక్తి ఉండేదని తెలిపారు. అక్షరాల పక్కన బొమ్మలు ఉండే చిత్రాల పుస్తకాలతో అతడిలో పఠనాసక్తి మొదలైందని పేర్కొన్నారు. అతడిలో ఉత్సాహాన్ని గమనించి.. అర్జున్ వేసిన ప్రశ్నలకు తాము ఓపికగా సమాధానం ఇచ్చామని గుర్తు చేసుకున్నారు. అలా అర్జున్‌ నేర్చుకోవడంపై అసక్తిని కనబరిచాడని వివరించారు.


అలాగే క్రమం తప్పకుండా గ్రంథాలయానికి తీసుకెళ్లడం వల్ల కూడా అతడిలో జిజ్ఞాస కలిగిందని వివరించారు. గ్రంథాలయంలో ఒకేసారి ఏడు ఎనిమిది పుస్తకాలు చదివే వాడని చెప్పారు. అతడు అడిగే ప్రశ్నకు తమకు సమాధానం తెలియకపోయినా.. మనమంతా కలిసి తెలుసుకుందామని చెప్పేవారమని తెలిపారు. అలా తమకు తెలియని ఎన్నో విషయాలను తెలుసుకున్నామని అన్నారు. నిత్యం అతడు పుస్తకాలతోనే సహవాసం చేస్తాడని చెప్పారు.


తమ కుటుంబంలోని పరిస్థితుల వల్లే అర్జున్ సెల్ ఫోన్‌కు చాలా దూరంగా ఉంటాడని తల్లిదండ్రులు వివరించారు. ఏదైనా పదాలకు అర్థం తెలియకుంటే వాటిని మమ్మల్ని అడిగేవాడన్నారు. అతడితో కలిసి డిక్షనరీలలో పదాలకు అర్థం వెతికేవారమని పేర్కొన్నారు. అర్జున్‌లోని మేధస్సును కెనడలోని అంటారియో ప్రావిన్స్‌ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అక్టోబర్ 29న అంటారియో శాసన సభలో అర్జున్ ప్రజాపతిని ఘనంగా సన్మానించనుంది.


Also Read:

ఆశలన్నీ ఆవిరై.. పొలంలో బైక్‌ రైడ్‌ చేస్తూ వినూత్న నిరసన

అమెరికాలో గ్యాంగ్‌స్టర్లు అరెస్ట్.. భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు..

బొత్స చైతన్యపై జనసేన ఫిర్యాదు.. జెడ్పీటీసీ నామినేషన్‌పై అభ్యంతరం

Updated Date - Oct 24 , 2026 | 01:17 PM