Share News

అమెరికాలో గ్యాంగ్‌స్టర్లు అరెస్ట్.. భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు..

ABN , Publish Date - Oct 24 , 2026 | 12:57 PM

భారత్‌లో పలు హత్యలు, కిడ్నాప్‌లకు పాల్పడిన గ్యాంగ్‌స్టర్లు హిమాంశు భావు, నీరజ్ ఫరీద్‌పురియా పట్టుబడ్డారు. అమెరికాలోని లాస్‌ వేగాస్‌లో అక్టోబర్ 22న వారిద్దరినీ ఆ దేశ పోలీసులు అరెస్టు చేశారు.

అమెరికాలో గ్యాంగ్‌స్టర్లు అరెస్ట్.. భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు..
Gangsters Arrested

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: భారత్‌లో పలు హత్యలు, కిడ్నాప్‌లకు పాల్పడిన గ్యాంగ్‌స్టర్లు హిమాంశు భావు, నీరజ్ ఫరీద్‌పురియా పట్టుబడ్డారు. అమెరికాలోని లాస్‌ వేగాస్‌లో అక్టోబర్ 22న వారిద్దరినీ ఆ దేశ పోలీసులు అరెస్టు చేశారు. హర్యానా స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ (STF) అందించిన సమాచారంతో నిందితులను అమెరికా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.


హర్యానాలోని రోహ్‌తక్‌ ప్రాంతానికి చెందిన హిమాంశు భావుపై హర్యానా, ఢిల్లీ పోలీసులు పలు తీవ్రమైన కేసులు నమోదు చేశారు. హర్యానా నుంచి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ వరకు అతని నేర సామ్రాజ్యం విస్తరించింది. హత్యలు, కిడ్నాప్‌లు, వ్యాపారవేత్తలను బెదిరించి డబ్బులు వసూలు చేయడం వంటి నేరాల్లో హిమాంశు హస్తం ఉందంటూ పలు కేసులు నమోదయ్యాయి. అతడిపై ఇంటర్‌పోల్‌ నోటీసు కూడా జారీ అయింది. అనంతరం నకిలీ పత్రాల సాయంతో పాస్‌పోర్టు పొందిన హిమాంశు భావు.. భారత్‌ నుంచి విదేశాలకు వెళ్లాడని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. విదేశాల్లో ఉంటూనే తన అనుచరుల ద్వారా నేర కార్యకలాపాలను కొనసాగించినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.


జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌కు హిమాంశు భావు ప్రత్యర్థిగా గుర్తింపు పొందాడు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ పరిధిలో జరిగిన పలు కాల్పుల ఘటనలు, హత్య కేసుల్లో అతడి గ్యాంగ్‌ ప్రమేయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, హిమాంశు భావు, నీరజ్‌ ఫరీద్‌పురియాలను భారత్‌కు తీసుకొచ్చేందుకు హర్యానా ఎస్టీఎఫ్‌ ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు అమెరికా అధికారులు, కేంద్ర దర్యాప్తు సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. వీరిని భారత్‌కు అప్పగించే ప్రక్రియలో తదుపరి చర్యలు కీలకంగా మారాయి. వీరి రాకతో పెండింగ్‌ కేసుల దర్యాప్తులో కీలక పురోగతి సాధించవచ్చని అధికారులు భావిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

జైష్ సంస్థతో సంబంధాలు.. ముంబైలో ఒకరి అరెస్ట్

అభిజీత్ దీప్కే లాంటి వాళ్లు వస్తారు.. సీజేపీ నేతపై పీయూష్ గోయల్ వ్యాఖ్యలు..

Updated Date - Oct 24 , 2026 | 01:13 PM