ఆగ్రాలో ఘోర ప్రమాదం.. జిప్‌లైన్ కేబుల్ తెగి 16 ఏళ్ల బాలుడి మృతి
ABN , Publish Date - May 25 , 2026 | 04:35 PM
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఆదివారం సాయంత్రం విషాద ఘటన చోటుచేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఆదివారం సాయంత్రం విషాద ఘటన చోటుచేసుకుంది. నగరంలోని తాజ్‌గంజ్ ప్రాంతంలో ఉన్న ఒక అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో జిప్‌లైన్ కేబుల్ తెగిపోవడంతో.. కునాల్ అగర్వాల్ అనే 16 ఏళ్ల బాలుడు దాదాపు 45 అడుగుల ఎత్తు నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం సెలవు దినం కావడంతో కునాల్ అగర్వాల్ సరదాగా గడపడానికి ఆ వినోద కేంద్రానికి వెళ్లాడు. అక్కడ ఏర్పాటు చేసిన జిప్‌లైన్ సాహస క్రీడలో పాల్గొంటుండగా.. ఊహించని విధంగా దానికి సంబంధించిన కేబుల్ తెగిపోయింది. దీంతో సుమారు 45 అడుగుల ఎత్తులో ఉన్న బాలుడు ఒక్కసారిగా కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అమ్యూజ్‌మెంట్ పార్క్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. అయితే, ఈ సాహస కార్యకలాపాలను ఒక ప్రైవేట్ కంపెనీకి అవుట్‌సోర్స్ వారు చేస్తున్నారని అమ్యూజ్‌మెంట్ పార్క్ అధికారులు తెలిపారు. ఘోర ప్రమాదం జరిగిన నేపథ్యంలో.. ముందు జాగ్రత్త చర్యగా అక్కడ జరిగే అడ్వెంచర్ యాక్టివిటీస్‌ని పోలీసులు నిలిపేశారు.
ఇవి కూడా చదవండి
ఇరాన్‌తో ఒప్పందం విషయంలో తొందరపడడం లేదు: డొనాల్డ్ ట్రంప్
ఐపీఎల్ 2026: పాపం పంజాబ్.. కలగానే మిగిలిన ‘తొలి కప్పు’!