Share News

హైవేపై బోల్తా పడ్డ ట్రక్.. చచ్చిన గొర్రెల కోసం ఎగబడ్డ జనం..

ABN , Publish Date - May 25 , 2026 | 07:43 AM

ఉత్తర్‌ప్రదేశ్‌లో మానవత్వాన్ని ప్రశ్నించే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. హైవేపై గొర్రెలతో వెళుతున్న ట్రక్ బోల్తా పడింది. ట్రక్‌లోని నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. గొర్రెలు పెద్ద సంఖ్యలో చనిపోయాయి. స్థానికులు గాయపడ్డ వారికి సాయం చేయాల్సిందిపోయి.. చనిపోయిన గొర్రెలను ఎత్తుకెళ్లారు.

హైవేపై బోల్తా పడ్డ ట్రక్.. చచ్చిన గొర్రెల కోసం ఎగబడ్డ జనం..
Kaushambi viral video

ఇంటర్‌నెట్ డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్‌లో మానవత్వాన్ని ప్రశ్నించే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. హైవేపై గొర్రెలతో వెళుతున్న ట్రక్ బోల్తా పడింది. ట్రక్‌లోని నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. గొర్రెలు పెద్ద సంఖ్యలో చనిపోయాయి. స్థానికులు గాయపడ్డ వారికి సాయం చేయాల్సిందిపోయి.. చనిపోయిన గొర్రెలను ఎత్తుకెళ్లారు. పోలీసులు వచ్చే వరకు గాయపడ్డ వ్యక్తులు బాధతో అల్లాడిపోయారు. పోలీసులు వచ్చి వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.. ఓ ట్రక్ 200 గొర్రెలతో కాన్పూర్ నుంచి ప్రయాగ్‌రాజ్ బయలుదేరింది. ఆదివారం మధ్యాహ్నం కౌశంబి జిల్లాలోని నేషనల్ హైవేపైకి చేరుకుంది. ఈ నేపథ్యంలోనే అందావా టెది దగ్గర ట్రక్ ప్రమాదానికి గురైంది. అతి వేగం కారణంగా అదుపు తప్పి బోల్తా పడింది.


దీంతో ట్రక్ డ్రైవర్, క్లీనర్‌‌తో పాటు మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. పెద్ద ఎత్తున గొర్రెలు చనిపోయాయి. స్థానికులు గాయపడ్డ వారికి సాయం చేయాల్సిందిపోయి.. దారుణానికి తెరతీశారు. చనిపోయిన గొర్రెలను దొంగిలించటం మొదలెట్టారు. బాధితులు సాయం కోసం అర్థిస్తున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. సమాచారం అందుకున్న కోఖ్‌రాజ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. క్రేన్ సాయంతో ట్రక్‌ను అక్కడినుంచి తొలగించారు.


ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియలో వైరల్‌‌గా మారాయి. ఆ వీడియోలపై స్పందిస్తున్న నెటిజన్లు గొర్రెలను ఎత్తుకెళ్లిపోయిన జనాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘నిజంగా వాళ్లు మనుషులేనా.. గాయపడ్డ వారికి సాయం చేయాల్సింది పోయి గొర్రెలను దొంగతనం చేస్తారా?’ అంటూ మండిపడుతున్నారు. వైరల్‌గా మారిన వీడియోలు పోలీసుల దృష్టికి వెళ్లాయి. వీడియోల ఆధారంగా గొర్రెలను ఎత్తుకెళ్లిన వారిని గుర్తిస్తామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.


ఇవి కూడా చదవండి

ముంబైతో మ్యాచ్‌కు ఫిట్‌గా లేను.. కానీ బరిలోకి దిగా: రియాన్ పరాగ్

అమరావతిలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో వేగం పెంచాలి: మంత్రి గొట్టిపాటి

Updated Date - May 25 , 2026 | 07:49 AM