పైలట్ చాకచక్యం.. ప్రమాదాన్ని ఎలా తప్పించిందో చూస్తే..
ABN , Publish Date - Aug 23 , 2026 | 05:21 PM
ఆకాశంలో ఎగురుతున్న విమానం.. ఒక్కసారిగా ఇంజిన్ ఫెయిల్.. ల్యాండింగ్ గేర్ కూడా పనిచేయలేదు. చుట్టూ సముద్రం.. కింద బీచ్.. క్షణాల్లో నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి. చివరకు ఏం జరిగిందంటే..
ఇంటర్నెట్ డెస్క్: ఫ్లోరిడాలోని బోకా రాటన్ తీరంలో రెండు ఇంజన్ల చిన్న విమానం అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయింది. అయితే.. విమానంలో ఉన్న 23 ఏళ్ల పైలట్ ఫెయిత్ టెంక్లీ ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. ఫోర్ట్ మైయర్స్‌లోని పేజ్ ఫీల్డ్ నుంచి బహమాస్‌లోని సౌత్ బిమిని విమానాశ్రయానికి వెళ్తున్న పైపర్ PA-30 విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ల్యాండింగ్ గేర్ పనిచేయకపోవడంతో పాటు రెండు ఇంజన్లలో ఒకటి విఫలమైంది. దీంతో రన్‌వేపై ల్యాండింగ్ చేస్తే ప్రమాదం.. అగ్నిప్రమాదం సంభవించే అవకాశం ఉందని భావించిన టెంక్లీ.. సముద్రంలో విమానాన్ని దించడమే సురక్షితమని నిర్ణయించుకున్నారు. బోకా రాటన్ తీరానికి చేరుకున్న టెంక్లీ.. బీచ్ వద్ద ఉన్న భవనాలు, ప్యాడిల్‌బోర్డర్లను తప్పించుకుంటూ విమానాన్ని స్వచ్ఛమైన నీటి ప్రదేశం వైపు మళ్లించారు. చివరకు విమానాన్ని సముద్రంలో సున్నితంగా ల్యాండ్ చేశారు.
విమానం నీటిలో దిగిన కొద్ది సేపటికే లైఫ్‌గార్డ్ అక్కడికి చేరుకుని పైలట్‌ను రక్షించారు. అనంతరం బోకా రాటన్ ఫైర్ రెస్క్యూ బోట్ కూడా అక్కడికి చేరుకుంది. అధికారులు ముందుజాగ్రత్తగా టెంక్లీని స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రమాద సమయంలో విమానంలో ఆమె ఒక్కరే ఉన్నట్లు అధికారులు తెలిపారు. విమానంలో సాంకేతిక సమస్యలు ఎలా తలెత్తాయి, ప్రమాదానికి దారితీసిన కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
వార్తలు కూడా చదవండి..
ఉద్యోగాలు, ప్రతిభకు దేశంలోనే నంబర్‌వన్ సిటీగా విశాఖ: సీఎం చంద్రబాబు
పవన్ కల్యాణ్ దిశానిర్దేశం.. శరవేగంగా అడవుల పునరుద్ధరణ కార్యక్రమం
ఈ ఏడాది మరో 3వేల టీచర్ పోస్టుల భర్తీ: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News