టీఎల్ సీఏ ఉగాది వేడుకల్లో ‘అమేయా’ ప్రారంభం
ABN , Publish Date - Apr 24 , 2026 | 08:11 PM
న్యూయార్క్‌లోని ఫ్లషింగ్‌లో జరిగిన టీఎల్ సీఏ ఉగాది వేడుకల్లో అశోక్ చింతకుంట దంపతులు అమేయ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ప్రారంభ వేడుకను ఘనంగా నిర్వహించారు. టీఎల్ సీఏ ప్రెసిడెంట్ సుమంత్ రామ్ శెట్టి చేతులమీదుగా ఈ అమేయ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ప్రారంభమైంది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో కళారంగానికి రెండు దశాబ్దాలకుపైగా సేవలందిస్తున్న న్యూయార్క్ వాస్తవ్యులు అశోక్ చింతకుంట, ఆయన సతీమణి మాధవి సోలేటి ప్రాంతీయ, జాతీయ తెలుగు సంఘాల కార్యక్రమాలతో పాటు ఇతర కమ్యూనిటీ ఈవెంట్లలో తమ నాటకాల ద్వారా వివిధ కార్యక్రమాల ద్వారా ఎంతోమందిని అలరిస్తూ వస్తున్నారు.
80కి పైగా కళా ప్రదర్శనలు..
అశోక్ చింతకుంట ఇంజినీర్‌గా, మాధవి సోలేటి టీచర్‌గా ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూనే.. మరోవైపు నాటక కళారంగంపై మక్కువతో వారు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. వారు ఇప్పటివరకు వరకు 80కి పైగా కళా ప్రదర్శనలు ఇచ్చారు. దాదాపు 800 మందికి మేకప్, కాస్ట్యూమ్స్‌లను అందించారు. వారు ప్రదర్శించిన నాటకాల్లో ముఖ్యమైనవి శ్రీకృష్ణ రాయబారం, మాయాజూదం, దక్షయజ్ఞం, బాలనాగమ్మ, తెలుగు వైభవం, షిర్డీ సాయి మహత్యం, బాలరామాయణం, శ్రీరామపట్టాభిషేకం, భక్తకన్నప్ప శ్రీకాళహస్తీశ్వర మహత్యం, శ్రీరామదాసు, న్యూయార్క్ నగర పోతరాజు, భక్తరామదాసు వంటివి ఉన్నాయి. స్థానిక తెలుగు సంఘాలైన టీఎల్ సీఏ, నైటా, టిఫాస్, టీఏజీడీవీ, కనెక్టికట్ తెలుగు సంఘాల కార్యక్రమాల్లో, జాతీయ తెలుగు సంఘాలైన తానా, ఆటా, నాటా, నాట్స్, టీటీఏ, మాటా నిర్వహించే కార్యక్రమాల్లోనూ వారి కార్యక్రమాలు ఎంతోమందిని అలరించాయి. గణేశ్ టెంపుల్, సాయి బాబా ఆలయాలు, హనుమాన్ టెంపుల్స్ కార్యక్రమాల్లో.. వివిధ ప్రభుత్వ కార్యాలయాలైన న్యూయార్క్ మేయర్ కార్యాలయం, లాంగ్ ఐలాండ్, బ్లూక్లిన్ డీఏ కార్యాలయాల్లో వారు ప్రదర్శనలు ఇచ్చారు.
ఏప్రిల్ 18వ తేదీన న్యూయార్క్‌లోని ఫ్లషింగ్‌లో జరిగిన టీఎల్ సీఏ ఉగాది వేడుకల్లో అశోక్ చింతకుంట దంపతులు అమేయ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ప్రారంభ వేడుకను ఘనంగా నిర్వహించారు. టీఎల్ సీఏ ప్రెసిడెంట్ సుమంత్ రామ్ శెట్టి చేతుల మీదుగా ఈ అమేయ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ప్రారంభమైంది. ఈ అమేయ ద్వారా నాటకాలు, స్క్రిప్ట్ రచన, సాంకేతిక నిర్మాణం, ప్రముఖ వ్యక్తులతో ఇంటరాక్టివ్ వర్క్‌షాప్‌లు ఏర్పాటు చేయనున్నట్లు అశోక్ చింతకుంట, మాధవి సోలేటి దంపతులు తెలిపారు.
Also Read:
నాట్స్ ఆధ్వర్యంలో ‘హైవే దత్తత’ కార్యక్రమం.. సామాజిక సేవలో తెలుగు విద్యార్థులు
రాజా కసుకుర్తి సేవలు సమాజానికి ఆదర్శం: ఆర్టీసీ మాజీ చైర్మన్ కొనకళ్ల
For More Latest News