Share News

తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా తొలి ‘5K రన్’కు విశేష స్పందన

ABN , Publish Date - Sep 01 , 2026 | 06:36 PM

తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా (TSN) ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహించిన ‘5K రన్/వాక్’ కార్యక్రమం విశేష స్పందనతో విజయవంతమైంది.

తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా తొలి ‘5K రన్’కు విశేష స్పందన
Telugu Samithi of Nebraska

  • ఆరోగ్య స్పృహతో సేవా సంకల్పం వైపు అడుగులు

ఒమాహా, నెబ్రాస్కా: తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా (TSN) ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహించిన ‘5K రన్/వాక్’ కార్యక్రమం విశేష స్పందనతో విజయవంతమైంది. ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడంతో పాటు సేవా కార్యక్రమాలకు చేయూతనివ్వాలనే సదుద్దేశంతో ఆగస్టు 30వ తేదీన ఒమాహాలోని చాల్కో హిల్స్ రిక్రియేషన్ ఏరియాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.


‘Stronger Together – Healthier Together – Better Together’ అనే స్ఫూర్తిదాయక నినాదంతో సాగిన ఈ కార్యక్రమంలో పిల్లలు, పెద్దలు, కుటుంబాలు కలిపి 200 మందికి పైగా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం యోగా స్ట్రెచింగ్‌తో ప్రారంభమైన ఈ కార్యక్రమం అనంతరం 5K రన్/వాక్ కొనసాగింది. ఈ రన్‌లో అన్ని వయసుల వారు ఉత్సాహంగా పాల్గొనడంతో చాల్కో హిల్స్ ప్రాంగణం సందడిగా మారింది.

NRI-3.jpg


ఈ కార్యక్రమం ద్వారా సమకూరిన నిధులను అమెరికాలో చిన్నారుల అభ్యున్నతికి కృషి చేస్తున్న Completely KIDS సంస్థతో పాటు, భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఇతర మౌలిక అవసరాలకు తోడ్పడే సేవా కార్యక్రమాలకు అందించనున్నారు. స్థానిక సమాజానికి చేయూతనిస్తూనే, మాతృదేశంలోని అవసరమైన వర్గాలకు అండగా నిలవాలనే సంకల్పం ఈ కార్యక్రమానికి ప్రత్యేకతను చేకూర్చింది.

NRI-5.jpg


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన డా. గురుదత్ పెండ్యాల, ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. కాశి మక్కం.. ఈ రన్ ప్రారంభానికి ముందు పాల్గొనేవారిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, క్రమమైన వ్యాయామం ప్రాముఖ్యాన్ని వివరిస్తూనే, సమాజ హితం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. వారి సందేశాలు పాల్గొన్న వారిలో నూతనోత్సాహాన్ని నింపాయి.

NRI-1.jpg


ఈ కార్యక్రమాన్ని కార్యరూపంలోకి తీసుకురావడం నుంచి విజయవంతంగా నిర్వహించడం వరకు తాతారావు కోసూరి, రాజేశ్ నాయక్వాడి విశేష కృషి చేశారు. ఈ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు, Completely KIDS సంస్థ, చాల్కో హిల్స్ నిర్వాహకులతో సమన్వయం తదితర బాధ్యతలను సమర్థంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి వీరిద్దరూ చూపిన చొరవ, అంకితభావం, సమన్వయం ప్రత్యేకంగా అభినందనీయం.

NRI-4.jpg


అలాగే TSN కార్యనిర్వాహక వర్గం, డైరెక్టర్లు, కోర్ టీమ్ సభ్యులు, వాలంటీర్లు తమ తమ బాధ్యతలను చక్కగా నిర్వర్తించి కార్యక్రమం సజావుగా సాగేందుకు సంపూర్ణ సహకారం అందించారు. ముందస్తు ప్రణాళిక నుంచి కార్యక్రమం ముగిసే వరకు అందరూ సమష్టిగా పనిచేయడం తొలి 5K రన్/వాక్ విజయానికి బలమైన పునాదిగా నిలిచింది.

NRI-2.jpg


ఈ కార్యక్రమంలో హైస్కూల్ విద్యార్థుల స్వచ్ఛంద సేవ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్న వయసులోనే సామాజిక బాధ్యతను గుర్తించి, తమ సమయాన్ని సేవ కోసం కేటాయించిన విద్యార్థుల సేవాభావం అందరి ప్రశంసలు అందుకుంది. యువతలో ఇలాంటి సేవా దృక్పథం పెంపొందడం భవిష్యత్తు సమాజానికి శుభసూచకమని పలువురు అభిప్రాయపడ్డారు.

NRI-1.jpg


5K రన్/వాక్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని నిర్వాహకులు మెడల్స్‌తో సత్కరించారు. పురుషుల విభాగంలో ఐదుగురు, మహిళల విభాగంలో ఐదుగురు, అలాగే 10 సంవత్సరాలు పైబడిన చిన్నారుల విభాగంలో పది మంది, 10 సంవత్సరాల్లోపు చిన్నారుల విభాగంలో పది మంది మెడల్స్ అందుకున్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఉత్సాహంగా పాల్గొనడం ఈ కార్యక్రమానికి మరింత ఉల్లాసాన్ని తీసుకొచ్చింది.


ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగిన ఈ కార్యక్రమం ఆరోగ్యం, సేవ, సామాజిక బాధ్యత అనే విలువలను ప్రతిబింబించింది. పరుగు పోటీలో గెలుపోటములకు అతీతంగా, తాము వేసిన ప్రతి అడుగూ ఓ మంచి లక్ష్యానికి తోడ్పడుతోందనే భావన పాల్గొన్న వారిలో ప్రత్యేక సంతృప్తిని కలిగించింది.


తొలి ప్రయత్నానికే 200 మందికి పైగా పాల్గొని విశేష ఆదరణ పొందడం నిర్వాహకుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఈ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని, రానున్న సంవత్సరాల్లో 5K రన్/వాక్‌ను మరింత విస్తృత స్థాయిలో నిర్వహించి, మరెంతో మందిని ఆరోగ్యం, సేవ అనే సదాశయంతో భాగస్వాములను చేయాలని తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా భావిస్తోంది.

ఆరోగ్యానికి వేసిన ప్రతి అడుగు… సేవకు అందించిన చేయూతగా మారిన ఈ తొలి 5K రన్/వాక్ TSN ప్రస్థానంలో ఓ ప్రత్యేక కార్యక్రమంగా నిలిచింది.


ఈ వార్తలు చదవండి

డాలస్‌లో తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతి మునిరత్నం నాయుడికి ఘనస్వాగతం

టెన్జింగ్-హిల్లరీ ఎవరెస్ట్ మారథాన్ పూర్తిచేసిన తానా బోర్డ్ చైర్మన్

Read Latest NRI News And AP News And International News And Telugu News

Updated Date - Sep 01 , 2026 | 07:42 PM