Share News

ఆర్థిక పాఠాలతోపాటు సామాజిక సేవలో శాన్వి గుళ్లపల్లి

ABN , Publish Date - Mar 12 , 2026 | 08:39 PM

డల్లాస్ సమీపంలోని సౌత్‌లేక్‌కు చెందిన ప్రవాసాంధ్ర బాలిక గుళ్లపల్లి శాన్వికి ఆర్థిక అంశాలపై చిన్నప్పటి నుండి ఆసక్తి మెండు. తన అభిరుచితో నేర్చుకున్న విజ్ఞానాన్ని అమెరికాలోని పిల్లలకు ఆర్థిక పాఠాలుగా బోధిస్తుంది.

ఆర్థిక పాఠాలతోపాటు సామాజిక సేవలో శాన్వి గుళ్లపల్లి

వాషింగ్టన్: డల్లాస్ సమీపంలోని సౌత్‌లేక్‌కు చెందిన ప్రవాసాంధ్ర బాలిక గుళ్లపల్లి శాన్వికి ఆర్థిక అంశాలపై చిన్నప్పటి నుండి ఆసక్తి మెండు. తన అభిరుచితో నేర్చుకున్న విజ్ఞానాన్ని అమెరికాలోని పిల్లలకు ఆర్థిక పాఠాలుగా బోధిస్తుంది. తద్వారా వచ్చిన సొమ్మును సామాజిక సేవా కార్యక్రమాలకు ఆమె వినియోగిస్తుంది. ఏలూరుకు చెందిన శాన్వి ఎనిమిదో తరగతి చదువుతోంది. ఆమెపై ఈ ప్రత్యేక కథనం.. శాన్వి తండ్రి గుళ్లపల్లి రవి ఫాస్ట్రా ఇన్వెస్ట్‌మెంట్స్ సంస్థకు సీఈవోగా విధులు నిర్వహిస్తున్నారు.


Saanvi1.jpg

శాన్వి.. చిన్ననాటి నుంచి తన తండ్రితో కలిసి టీవీలో బిజినెస్ వార్తలు చేసేది. అలాగే పలు పత్రికల్లో ఫైనాన్స్ కాలమ్స్ చదవడం ద్వారా నగదు, పెట్టుబడులు, స్టాక్ మార్కట్ తదితర అంశాలపై మక్కువ పెంచుకొంది. ఆరేళ్ల వయస్సులో అమెరికాలో ప్రముఖ బిజినెస్ ఛానెల్ సీఎన్‌బీసీ (CNBC)కు వీడియో ద్వారా ప్రశ్న పంపింది. దీంతో ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు స్కాట్ వాప్నర్ ద‌ృష్టిలో శాన్వి పడింది. 2023లో ఆయన సహకారంతో CNBC Halftime Report కార్యక్రమంలో పాల్గొంది. తద్వారా న్యూయార్క్ స్టాక్ ఎక్స్‌చెంజ్ సందర్శించి..క్లోజింగ్ బెల్ చూడగలిగే అవకాశాన్ని పొందింది. దాంతో ఆర్థిక రంగంపై శాన్విలో ఆసక్తిని మరింత రేకెత్తించాయి.


Saanvi2.jpg

అమెరికా, భారతదేశం తదితర దేశాల్లోని విద్యా వ్యవస్థల్లో ఆర్థిక అంశాలపై అంటే.. ద్రవ్యోల్బణం, పెట్టుబడులు తదితర అంశాలపై జ్ఞానం తక్కువగా ఉందని శాన్వి గుర్తించింది. ఈ నేపథ్యంలో 2025లో శాన్వి ఫైనాన్స్ అకాడమీ అనే లాభాపేక్ష లేని సంస్థను ప్రారంభించింది. దీని ద్వారా అమెరికా సహా పలు దేశాల విద్యార్థులకు ఆర్థిక అంశాలపై విద్యను అందిస్తోందీ శాన్వి.

ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న శాన్వి ఐదు నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేకంగా రూపొందించిన పది వారాల కోర్సు ద్వారా ప్రతి శనివారం ఆర్థిక పాఠాలు బోధిస్తోంది. ఆదాయం, ఖర్చులు, పెట్టుబడులు, రిస్క్ వంటి అంశాలను పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా వివరించేందుకు పాఠ్యాంశాలను ఆమె స్వయంగా రూపొందించి ప్రత్యేకంగా ముద్రించింది.


2025లో సౌత్‌లేక్ నగరంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు 20 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కోర్సు ద్వారా వచ్చిన రూ. 2. 70 లక్షలు($3 వేలు) మొత్తాన్ని ఇర్వింగ్‌లోని సాల్వేషన్ ఆర్మీ సేవా సంస్థకు విరాళంగా అందజేసింది. ఆమె ప్రయత్నాన్ని సౌత్‌లేక్ నగర మేయర్, సిటీ కౌన్సిల్ సభ్యులు అభినందిస్తూ.. ప్రత్యేకంగా సత్కరించారు. జనవరి 6వ తేదీని సౌత్‌లేక్‌లో శాన్వి గుళ్లపల్లి డేగా వారు ప్రకటించారు.


ప్రస్తుతం టెక్సాస్‌లోని ఫ్రిస్కో నగరంలో శాన్వి.. తన కోర్సును నిర్వహిస్తోంది. మూడు వారాల క్రితం ప్రారంభించిన ఈ తరగతుల్లో ఇప్పటికే 23 మంది విద్యార్థులు చేరారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికి రూ. 4.50 లక్షలు ($5వేలు) నిధులు సమకూరాయని తెలిపారు. ఆ నగదును త్వరలోనే ఒక సేవా సంస్థకు విరాళంగా అందజేస్తానని శాన్వి వెల్లడించింది. అమెరికాలోని కాలిఫోర్నియా, ఓహాయో, జార్జియా రాష్ట్రాల నుంచే కాక.. భారత్, ఆస్ట్రేలియా తదితర దేశాల నుంచి కూడా ఆన్‌లైన్ ద్వారా ఈ కోర్సులో చేరేందుకు 18 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు.


పిల్లల్లో ఆర్థిక అవగాహన పెంపొందించడం తన ప్రధాన లక్ష్యమని శాన్వి చెబుతోంది. భవిష్యత్తులో మరిన్ని నగరాలకు తన కార్యక్రమాలను విస్తరించి, ఎక్కువ మంది విద్యార్థులకు ఫైనాన్షియల్ లిటరసీ అందించాలనే సంకల్పంతో ఆమె ముందుకు సాగుతోంది. మరిన్ని వివరాలు కావాలంటే.. https://www.saanvifinanceacademy.com/ చూడవచ్చు.

Saanvi.jpeg


ఈ వార్తలు కూడా చదవండి:
నాట్స్ కార్యవర్గం ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం

మిషిగన్ స్టేట్ రిప్రజెంటేటివ్ బరిలో ప్రవాసాంధ్రుడు అశోక్ బడ్డి

For More NRI News And Telugu News

Updated Date - Mar 12 , 2026 | 08:52 PM