మణిపూర్ సీఎంగా పగ్గాలు చేపట్టనున్న ఖేమ్‌చంద్ సింగ్
ABN , Publish Date - Feb 03 , 2026 | 08:16 PM
మణిపూర్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు కేంద్రం చేపట్టిన సన్నాహకాల్లో భాగంగా ఆ పార్టీ రాష్ట్ర శాఖ శాసనసభా పక్ష నేతగా యుమునాం ఖేమ్‌చంద్ సింగ్ మంగళవారం నాడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
న్యూఢిల్లీ: మణిపూర్ (Manipur) కొత్త ముఖ్యమంత్రిగా యుమునాం ఖేమ్‌చంద్ సింగ్ (Yumnam Khemchand Singh) పగ్గాలు చేపట్టనున్నారు. జాతుల మధ్య ఘర్షణలతో మణిపూర్ అట్టుడకడంతో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ గతేడాది రాజీనామా చేశారు. దీంతో తొలుత 6 నెలలపాటు అక్కడ రాష్ట్రపతి పాలన విధించి మరోసారి దానిని పొడిగించారు. ఈ క్రమంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు కేంద్రం చేపట్టిన సన్నాహకాల్లో భాగంగా బీజేపీ రాష్ట్ర శాసనసభా పక్ష నేతగా యుమునాం ఖేమ్‌చంద్ సింగ్ మంగళవారం నాడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో 62 ఏళ్ల ఖేమ్‌చంద్ మణిపూర్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు మార్గం సుగమమైంది.
మణిపూర్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ జాతీయ నాయకత్వం కొన్నిరోజులుగా న్యూఢిల్లీలో కసరత్తు చేస్తోంది. మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యేలతో కేంద్ర నాయకత్వం విస్తృత స్థాయి చర్చలు జరిపింది. అనంతరం మణిపూర్ శాసనసభా పక్ష నేత ఎన్నిక కోసం కేంద్ర పరిశీలకునిగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్‌ను నియమించింది. అనంతరం శాసనసభా పక్ష నేతగా ఖేమ్ చంద్ సింగ్ ఎన్నికయ్యారు.
ఎవరీ ఖేమ్‌చంద్..?
మణిపూర్ రాజకీయాల్లో బీజేపీ కీలక నేతగా ఖేమ్‌చంద్ పేరు తెచ్చుకున్నారు. 2017, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఇంఫాల్ వెస్ట్‌లోని సింజమీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2017 మార్చి నుంచి 2022 మార్చి వరకూ మణిపూర్ అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సాధించడంతో బీరేన్ సింగ్ ప్రభుత్వంలో రెండోసారి క్యాబినెట్ మంత్రిగా సింగ్ నియమితులయ్యారు. మున్సిపల్ పాలనా వ్యవహారాలు, హౌసింగ్ డెవలప్‌మెంట్, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, విద్యా శాఖలను నిర్వహించారు. 2025 ఫిబ్రవరిలో మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించేంత వరకూ ఆ పదవులను ఆయన సమర్ధవంతంగా నిర్వహించారు. రాజకీయాలతోపాటు మార్షల్ ఆర్ట్స్ పట్ల సింగ్‌కు ఆసక్తి మెండు. 2025 డిసెంబర్‌లో సియోల్‌లో గ్లోబల్ ట్రెడిషనల్ తైక్వాండో ఫెడరేషన్ నిర్వహించిన సంప్రదాయ తైక్వాండోలో ఫిఫ్త్-డాన్ బ్లాక్‌బెల్ట్‌ను ఆయన అందుకున్నారు. ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయుడిగా నిలిచారు.
ఇవి కూడా చదవండి..
140 కోట్ల భారతీయులకు మేలు చేసే డీల్.. యూఎస్‌తో వాణిజ్య ఒప్పందంపై పీయూష్ గోయల్
చమురు కొనుగోళ్లు నిలిపివేస్తామని భారత్ మాతో చెప్పలేదు.. రష్యా స్పందన