Share News

140 కోట్ల భారతీయులకు మేలు చేసే డీల్.. యూఎస్‌తో వాణిజ్య ఒప్పందంపై పీయూష్ గోయల్

ABN , Publish Date - Feb 03 , 2026 | 06:37 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తనకున్న మైత్రీ సంబంధాలను ఉపయోగించుకుని మనం పోటీ పడే అన్ని దేశాల కంటే బెస్ట్ డీల్‌ను ప్రధానమంత్రి మోదీ కుదుర్చుకున్నారని పీయూష్ గోయల్ తెలిపారు.

140 కోట్ల భారతీయులకు మేలు చేసే డీల్.. యూఎస్‌తో వాణిజ్య ఒప్పందంపై పీయూష్ గోయల్
Piyush Goyal

న్యూఢిల్లీ: భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం రైతుల నుంచి మత్స్యకారుల వరకూ దేశంలోని 140 కోట్ల మందికి ప్రయోజనకారిగా ఉంటుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) తెలిపారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం, ఆ విషయాన్ని ప్రధానమంత్రి మోదీ ధ్రువీకరించడం అనేక ప్రశ్నలకు తావిచ్చింది. దీంతో ఈ ట్రేడ్ డీల్‌కు సంబంధించిన కొన్ని వివరాలను మీడియాతో పీయూష్ గోయల్ పంచుకున్నారు.


పార్లమెంటులో ఈ (ట్రేడ్ డీల్) వివరాలను పంచుకోవాలని తాను అనుకున్నానని, అయితే లోక్‌సభలో ఈరోజు ఎంత రభస జరిగిందో అందరూ చూశారని గోయల్ అన్నారు. సభలో జరిగిన దానికి రాహుల్ గాంధీని ఆయన తప్పుపట్టారు. మాజీ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే అముద్రిత పుస్తకం నుంచి విపక్ష నేత కొన్ని అంశాలను ప్రస్తావించేందుకు చేసిన ప్రయత్నమే ఈ రభసకు కారణమని అన్నారు.


బెస్ట్ డీల్..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తనకున్న మైత్రీ సంబంధాలను ఉపయోగించుకుని మనం పోటీ పడే అన్ని దేశాల కంటే బెస్ట్ డీల్‌ను ప్రధానమంత్రి మోదీ కుదుర్చుకున్నారని పీయూష్ గోయల్ తెలిపారు. 'ఎన్నో సవాళ్లు ఉన్నాయి. 50 శాతం టారిఫ్‌లను భారత్ ఎదుర్కొంది. రైతులు, సముద్ర ఉత్పత్తుల ఎగుమతి దారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డీల్ ఎప్పుడు కుదురుతుందంటూ కొన్నిరోజుల క్రితం వరకూ విపక్షాలు మమల్ని అడుగుతూనే ఉన్నాయి. నెలల తరబడి ఈ డీల్ పొందలేకపోయాం. కానీ ప్రధాని తనకున్న మైత్రీ సంబంధాలను ఉపయోగించుకుని గొప్ప డీల్ కుదిర్చారు. ఈ డీల్‌తో భారత్‌కు ఎన్నో విధాలుగా మేలు జరుగుతుంది' అని గోయల్ వివరించారు.


పండుగ చేసుకుంటారు..

వ్యవసాయరంగం పరిరక్షణపై వ్యక్తమవుతున్న అనుమానాలపై మాట్లాడుతూ.. వ్యవసాయం, పాడిరంగం పరిరక్షణపై మొదట్నించీ మోదీ దృష్టిసారించారని, వాటికి ఎలాంటి చెడు జరగదని చెప్పారు. సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేసే మత్స్యకారులు ఈ డీల్ తర్వాత పండుగ చేసుకుంటారని, భారత ఉజ్వల భవిష్యత్తుకు ఈ డీల్ సంకేతమని చెప్పారు. ముఖ్యంగా ఇంజనీరింగ్, టెక్స్‌టైల్స్, మెరైన్ గూడ్స్, జెమ్స్, జ్యూవెల్లరీ రంగాలకు చాలా ప్రయోజనాలు చేకూరుతాయని పీయూష్ గోయల్ వివరించారు.


ఇవి కూడా చదవండి..

చమురు కొనుగోళ్లు నిలిపివేస్తామని భారత్ మాతో చెప్పలేదు.. రష్యా స్పందన

అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఈ శతాబ్దపు అతిపెద్ద డీల్: ప్రధాని మోదీ

Updated Date - Feb 03 , 2026 | 07:42 PM