అఖిలేష్ యాదవ్ కుమార్తెపై ట్రోలింగ్.. ఎఫ్ఐఆర్ నమోదుకు యోగి ఆదేశం
ABN , Publish Date - Jun 14 , 2026 | 05:37 PM
సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కుమార్తె అదితి యాదవ్‌పై కొందరు తప్పుడు, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ చేయడంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర అభ్యంతర వ్యక్తం చేశారు. సమాజంలో ఎవరి ఆడపిల్లపైనా ఒకటేనని, వారిని ఇలాంటి నీచమైన ప్రజా చర్చల్లోకి లాగకూడదని అన్నారు.
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కుమార్తె అదితి యాదవ్‌పై కొందరు తప్పుడు, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ చేయడంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) తీవ్ర అభ్యంతర వ్యక్తం చేశారు. సమాజంలో ఎవరి ఆడపిల్లపైనా ఒకటేనని, వారిని ఇలాంటి నీచమైన బహిరంగ చర్చల్లోకి లాగకూడదని అన్నారు. యూపీలోని అంజాంగఢ్‌లో రూ.955 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను యోగి ఆదిత్యనాథ్ ఆదివారంనాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడకూతుళ్లపై అభ్యంతరకర వ్యాఖ్యలను అనుమతించే ప్రసక్తే లేదని అన్నారు.
'సామాజిక మాధ్యమాల్లో ఇటీవల సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కుమార్తెపై కొందరు వ్యక్తులు అనుచిత వ్యాఖ్యలు చేయడం చూశాను. వారిపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించాను' అని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. ఆడకూతుళ్లు అందరికీ కూతుళ్లేనని, గ్రామాల్లో ఆడపిల్లలను తమ ఆడపిల్లలుగా, అక్కాచెల్లెళ్లను తమ సొంత సోదరీమణులుగా చూస్తారని, అలాంటి సంస్కృతిలో పెరిగిన మనం ఆడపిల్లల పట్ల ఎలాంటి వైరుధ్యం చూపించరాదని అన్నారు.
అఖిలేష్ యాదవ్ కుమార్తెను టార్గెట్ చేస్తూ సామాజిక మాధ్యమంలో పరువునష్టం కలిగించే పోస్ట్‌ను సర్క్యులేట్ చేసిన వారిపై ఇటీవల ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. తప్పుడు ఉద్దేశాలతో కొందరు వ్యక్తులు ఈ పోస్టులను సర్క్యులర్ చేస్తున్నారంటూ అఖిలేష్ యాదవ్ కాన్పూర్ పోలీస్ కమిషనరేట్ సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేశారు. ఫోటో మార్ఫింగ్ చేసి, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
అలాంటి వాళ్లను మాకు అప్పగించండి
ఆడపిల్లలు, సీనియర్ సిటిజన్లను కించపరచేలా సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు వ్యవహరిస్తుండటంపై కూడా యోగి ఆదిత్యనాథ్ చురకలు వేశారు. 'అఖిలేష్ జీ.. మహిళలు, సీనియర్ సిటిజన్లు, సీనియర్ నేతలను కించపరచే వ్యాఖ్యలు చేయవద్దని మీ కార్యకర్తలకు సూచించండి. తగిన సంయమనంతో వ్యవహరించేలా చూడండి. వారికి బాగా అర్ధమయ్యేలా చెప్పండి. అప్పటికీ వారికి అర్ధం కాకపోతే మాకు అప్పగించండి. వారికి ఎలా చెప్పాలో అలా మేము చెబుతాం.. అని అన్నారు.
ఇవి కూడా చదవండి..
మమతా బెనర్జీకి టీఎంసీ రెబల్ ఎంపీ కకోలి దస్తిదార్ తనయుడు లీగల్ నోటీసు
ఉద్ధవ్ శివసేనలో ఫిరాయింపుల బెడద.. ఎంపీలతో అత్యవసర సమావేశం