Share News

మమతా బెనర్జీకి టీఎంసీ రెబల్ ఎంపీ కకోలి దస్తిదార్ తనయుడు లీగల్ నోటీసు

ABN , Publish Date - Jun 14 , 2026 | 04:14 PM

తృణమూల్ కాంగ్రెస్‌లో తలెత్తిన సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆ పార్టీ చీఫ్ మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ తిరుగుబాటు ఎంపీ కకోలి ఘోష్ దస్తిదార్ తనయుడు డాక్టర్ బైద్యనాథ్ ఘోష్ దస్తిదార్ తాజాగా మమతాబెనర్జీ, పలువురు ఇతర నేతలకు లీగల్ నోటీసు పంపారు.

మమతా బెనర్జీకి టీఎంసీ రెబల్ ఎంపీ కకోలి దస్తిదార్ తనయుడు లీగల్ నోటీసు
Dr Baidyanath and Mamata Banerjee

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో తలెత్తిన సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆ పార్టీ చీఫ్ మమతా బెనర్జీ (Mamata Banerjee)కి మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ తిరుగుబాటు ఎంపీ కకోలి ఘోష్ దస్తిదార్ తనయుడు డాక్టర్ బైద్యనాథ్ ఘోష్ దస్తిదార్ తాజాగా మమతాబెనర్జీ, పలువురు ఇతర నేతలకు లీగల్ నోటీసు పంపారు. బారాసాత్ నియోజకవర్గం నుంచి తాను టిక్కెట్ కోరానంటూ తనపై చేసిన వ్యాఖ్యలపై వారంతా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు. పార్టీ ఎంపీలు కల్యాణ్ బెనర్జీ, సౌగత్ రాయ్, మహువా మొయిత్రా, సోనాలి గుహకు కూడా ఈ నోటీసులు పంపారు. తాను పంపిన నోటీసులపై స్పందించకుంటే పరువునష్టం దావా వేస్తానని బైద్యనాథ్ హెచ్చరించారు.


ఏమిటీ వివాదం?

మమతాబెనర్జీ ఇటీవల జరిగిన విలేఖరుల సమావేశంలో బారాసాత్ నుంచి ఎమ్మెల్యే టిక్కెట్ కోసం కొందరు వ్యక్తులు తనను సంప్రదించారని చెప్పారు. అయితే పార్టీ నాయకత్వం ఆ ప్రతిపాదనను తోసిపుచ్చిందని తెలిపారు. ఇప్పటికే ఆమె (కకోలి దస్తిదార్) ఎంపీగా ఉన్నారని, తన ఇంట్లోని ప్రతి ఒక్కరూ ఎంపీ లేదా ఎమ్మెల్యే కావాలని ఆమె ఉద్దేశమా? అని ప్రశ్నించారు. దీనిపై బైద్యనాథ్ తన లాయర్ పూజా శుక్లా ద్వారా ఇచ్చిన నోటీసులో ఘాటుగా స్పందించారు. బారాసాత్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని తాను కోరలేదని, తనకు అలాంటి ఆసక్తి కూడా లేదని అన్నారు. తాను, తన తల్లి తరచు మద్యం సేవిస్తామని మరో ఎంపీ సోనాలి గుహ చేసిన ఆరోపణలను కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమనీ, సమాజంలో పేరున్న వైద్యుడిగా కూడా తన పరువుకు నష్టం కలిగించేలా అవి ఉన్నాయని అన్నారు. తాను పొలిటికల్ నామినేషన్ కోరలేదనే విషయాన్ని ఒప్పుకుంటూ 15 రోజుల్లోగా తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.


బైద్యనాథ్ తల్లి, టీఎంసీ సీనియర్ ఎంపీ కకోలీ దస్తిదార్ ఇటీవల పార్టికి రాజీనామా చేశారు. బారాసత్ పార్లమెంటరీ డిస్ట్రిక్ ప్రెసిడెంట్ పదవి నుంచి కూడా వైదొలిగారు. మమతాబెనర్జీకి సుదీర్ఘకాలంగా సన్నిహితురాలిగా పేరున్న దస్తిదార్ పార్టీ పనితీరు, అవినీతి ఆరోపణలు, పాలనాంశాలపై ఇటీవల విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో దస్తిదార్ కుమారుడు బైద్యనాథ్ సైతం మమతాబెనర్జీ, పలువురు టీఎంసీ ఎంపీలకు లీగల్ నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.


ఇవి కూడా చదవండి..

ఉద్ధవ్ శివసేనలో ఫిరాయింపుల బెడద.. ఎంపీలతో అత్యవసర సమావేశం

కనీసం సంతాపం కూడా తెలియజేయరా? యూఎస్‌పై శశి థరూర్ ఆగ్రహం

Updated Date - Jun 14 , 2026 | 04:19 PM