కేతన్ హత్య కేసు.. నీకూ అదే గతి పడుతుందని సాక్షిని బెదిరించిన నిందితుడు
ABN , Publish Date - Sep 28 , 2026 | 11:35 AM
పుణెకు చెందిన రియల్టర్ కేతన్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముగ్గురు నిందితుల్లో ఒకరైన చేతన్ చౌధరి.. కేతన్‌ను లోహగఢ్ కోట నుంచి కిందకు తోసేస్తుండగా తాను చూశానని ప్రత్యక్ష సాక్షి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు.
ఇంటర్‌నెట్ డెస్క్: పుణెకు చెందిన రియల్టర్ కేతన్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముగ్గురు నిందితుల్లో ఒకరైన చేతన్ చౌధరి.. కేతన్‌ను లోహగఢ్ కోట నుంచి కిందకు తోసేస్తుండగా తాను చూశానని ప్రత్యక్ష సాక్షి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఈ విషయం బయటకు చెబితే ‘నీకూ అదే గతి పడుతుంది’ అని చేతన్ తనను బెదిరించాడని ఆ సాక్షి తెలిపారు. పోలీసులకు సాక్షి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. తన స్నేహితులతో కలిసి సాక్షి.. లోహగఢ్ కోటకు వెళ్లారు. వారు కోట మెట్లు ఎక్కుతుండగా.. కేతన్, సియా గోయల్‌ను ఆయన చూశారు. కేతన్, సియా వెనుక చేతన్ కూడా వెళుతున్నాడు. ఆ టైం (జూన్) లో చేతన్ హుడీ ధరించి ఉన్నాడు. బయట వాతావరణం అంత వేడిగా ఉన్నా ఎందుకు హుడీ వేసుకున్నావని చేతన్‌ను సాక్షి అడిగాడు. చేతన్ ముఖాన్ని సాక్షి గుర్తుపెట్టుకున్నాడు.
కోటపైకి చేరుకున్న తర్వాత కేతన్, సియా ముందుకు వెళ్లగా.. చేతన్ ఒక ఆలయం వద్ద కూర్చున్నాడు. సాక్షికి కడుపులో అసౌకర్యంగా ఉండడంతో కాసేపు ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆయన తిరిగి వస్తుండగా.. చేతన్ వైపు సియా ఏదో సైగలు చేస్తున్నట్లు కనిపించడం చూశారు. తర్వాత ఆమె కింద కూర్చొని కేతన్ కాలిపై తన కాలితో తన్నింది. వెంటనే చేతన్ అక్కడకు చేరుకుని కేతన్‌ను కొండపై నుంచి కిందకు తోసేశాడు.
'అలాగే చస్తావని బెదిరించాడు'
ఈ ఘటన తర్వాత సాక్షి.. చేతన్ వద్దకు వెళ్లి నిలదీశారు. దీంతో ‘నువ్వు చూసింది ఎవరికీ చెప్పకు. ఎవరికైనా చెబితే నీకూ అదే గతి పడుతుంది. నిన్ను కూడా కొండపై నుంచి కిందకు తోసేస్తాం’ అని చేతన్ బెదిరించాడు. ఆరోజు సాక్షి ఇంటికి వెళ్లాక జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడ్డాడు. కాగా.. కేతన్ హత్య గురించి తర్వాత మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో సాక్షి పోలీసులను సంప్రదించి ఆరోజు ఏం జరిగిందో చెప్పారు. తన వాంగ్మూలాన్ని ఆయన రికార్డు చేయించారు. కాగా.. భద్రతా కారణాల వల్ల సాక్షి పేరును పోలీసులు వెల్లడించలేదు. ఇక, కేతన్ హత్య కేసుకు సంబంధించి పుణె రూరల్ పోలీసులు ఈనెల 8న 5053 పేజీల చార్జిషీటును దాఖలు చేశారు. ఫోరెన్సిక్ నివేదికల ద్వారా రికవరీ చేసిన నిందితుల కాల్ డేటా, చాట్లను పోలీసులు దర్యా్ప్తు చేస్తున్నారు. ఈ హత్య కేసులో మూడో నిందితుడు రితేశ్ హంగేను పోలీసులు ఇదివరకే అరెస్టు చేశారు. చేతన్ స్నేహితుడు రికేశ్. కేతన్‌ను హత్య చేయడానికి సియా, చేతన్ వేసిన ప్లాన్ గురించి రితేశ్‌కు తెలుసని పోలీసులు వెల్లడించారు. ఈ ఏడాది జూన్ 18న పుణె సమీపంలోని లోహగఢ్ కోటపై నుంచి కిందకు తోసేయడంతో కేతన్ చనిపోయాడు. కేతన్ ఫియాన్సీ సియా, ఆమె ప్రియురాలు చేతన్ కలిసి ఆ హత్యకు కుట్రపన్నారని, కొండపై నుంచి కేతన్‌ను కిందకు తోసేయాలని ప్లాన్ చేశారని పోలీసులు తెలిపారు.