ఇక్కడ కాకుంటే ఢిల్లీలోనే తేల్చుకుంటా.. మమతా బెనర్జీ
ABN , Publish Date - Jun 01 , 2026 | 09:40 PM
టీఎంసీ సీనియర్ నేతలపై జరిగిన దాడులపై నిరసన తెలిపేందుకు తమ పార్టీకి పోలీసులు అనుమతి నిరాకరించినట్టు ఆ పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. పశ్చిమబెంగాల్‌లో 'పోలీస్ రాజ్యం' నడుస్తోందని ఆరోపించారు.
కోల్‌కతా: టీఎంసీ సీనియర్ నేతలపై జరిగిన దాడులపై నిరసన తెలిపేందుకు తమ పార్టీకి పోలీసులు అనుమతి నిరాకరించినట్టు ఆ పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) తెలిపారు. పశ్చిమబెంగాల్‌లో 'పోలీస్ రాజ్యం' నడుస్తోందని అన్నారు. మంగళవారంనాడు తాము చేపట్టనున్న నిరసన దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరిస్తే ఢిల్లీ వెళ్లి ఒంటరిగానే తాను నిరసన తెలుపుతానని చెప్పారు.
పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో సోమవారంనాడు వర్చువల్ సమావేశంలో మమతా బెనర్జీ మాట్లాడారు. 'కోల్‌కతాలోని రాణి రష్మోని రోడ్డులో మంగళవారంనాడు నిరసన చేపట్టేందుకు పోలీసుల అనుమతి కోరాం. అందుకు పోలీసులు నిరాకరించారు. రాజకీయ దురుద్దేశంతోనే అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ ఆందోళన ఆపేది లేదు. అవసరమైతే ఢిల్లీలో నిరసనకు కూర్చుంటాను. రాణి రష్మోని రోడ్డు అంతా క్లియర్‌గా ఉంది. కేవలం 100 మందితో నిరసన చేపట్టాలనుకున్నాం. పోలీసులకు లెటర్ కూడా ఇచ్చాం. అక్కడ అనుమతించకుంటే మరో వేదిక సూచించాలి. అంతేకానీ అనుమతి నిరాకరిస్తామంటే ఢిల్లీలోనే ఒంటరిగా నిరసన సాగిస్తా' అని అన్నారు.
దాడులతో టీఎంసీ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, కల్యాణ్ బెనర్జీని చంపేందుకే ప్రయత్నించారని, రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తోందని, ఒక పద్దతి ప్రకారం టీఎంసీ రాజకీయ కార్యకలాపాలను అడ్డుకుంటోందని బీజేపీపై మమత విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో చట్టబద్ధ పాలన లేకుండా పోయిందన్నారు. పార్టీ కార్యకర్తలను సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు కానీ, ఇళ్ల నుంచి బయటకు రావడానికి కానీ అనుమతించడం లేదని ఆరోపించారు. 'వాళ్లు 2,500 పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేశారు. ఈద్గాలు సీజ్ చేశారు. మిషనరీ సంస్థలను మూయించారు. పార్టీ సమావేశాల్లో పాల్గొంటే తప్పుడు ఆయుధాల కేసు, నార్కోటిక్ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు' అని మమత ఆరోపణలు చేశారు. డబ్బుతో కొంతమంది ఎంపీలనో, ఎమ్మెల్యేలనో ప్రలోభపెట్టగలరేమో కానీ అంతకంటే ఏమీ చేయలేరని, టీఎంసీ మరింత బలపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి...
ఆవులపై ద్వంద్వ ప్రమాణాలు మానండి.. యోగి స్ట్రాంగ్ కౌంటర్
చిక్కుల్లో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం..! ఎమ్మెల్యేలతో 3న అత్యవసర సమావేశం