రెండ్రోజుల్లో.. కొత్త పార్టీ వదంతులపై స్పందించిన అన్నామలై
ABN , Publish Date - Jun 01 , 2026 | 05:43 PM
భారతీయ జనతా పార్టీకి ఉద్వాసన చెప్పి కొత్త పార్టీని స్థాపించనున్నారంటూ వస్తున్న ఊహాగానాలపై ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై తొలిసారి స్పందించారు. న్యూఢిల్లీకి సోమవారంనాడు ఆయన బయలుదేరుతూ మీడియాతో మాట్లాడారు. దయచేసి కొద్దిగా వేచిచూడండి. రెండ్రోజుల్లో మనం కూర్చుని మాట్లాడుకుందా.. అని అన్నామలై తెలిపారు.
చెన్నై: భారతీయ జనతా పార్టీ (BJP)కి ఉద్వాసన చెప్పి కొత్త పార్టీని స్థాపించనున్నారంటూ వస్తున్న ఊహాగానాలపై ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై తొలిసారి స్పందించారు. న్యూఢిల్లీకి సోమవారంనాడు ఆయన బయలుదేరుతూ మీడియాతో మాట్లాడారు. 'దయచేసి కొద్దిగా వేచిచూడండి. రెండ్రోజుల్లో మనం కూర్చుని మాట్లాడుకుందా' అని అన్నామలై తెలిపారు.
బీజేపీలో తన భవిష్యత్తుపై చర్చించేందుకు అన్నామలై ఢిల్లీ వెళ్తున్నారు. ఇందుకోసం తనకు సమయం కేటాయించాల్సిందిగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌ను అన్నామలై కోరారు. న్యూఢిల్లీ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కూడా అన్నామలై కలుసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.
అన్నామలై ఈనెల 4న తన పుట్టినరోజు కావడంతో అదేరోజు కొత్త పార్టీ ప్రకటన చేస్తారని ఆయన సహచరులు చెబుతున్నారు. అన్నామలై '2.0 అవతార్' పేరుతో మదురై, కోయంబత్తూరులో పోస్టర్లు సైతం వెలిసాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన త్రిభాషా విధానంతో అన్నామలై విభేదిస్తున్నారు. విద్యార్థులకు, ముఖ్యంగా తమిళనాడులోని వారికి మానసిక ఒత్తిడిని పెంచే ఈ విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఆయన ఇటీవల కోరారు. దీనికితోడు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తుపెట్టుకోవడం, కూటమికి అన్నాడీఎంకే పెద్దన్నగా వ్యవహరించడంపై అన్నామలై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో కొనసాగాలని ఆయనకు బీజేపీ నచ్చచెబుతుందా, కొత్త పార్టీకే ఆయన మొగ్గుచూపుతారా అనేది తమిళనాట ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి..
కొత్త పార్టీ యోచనలో అన్నామలై..!
అన్నామలై '2.0 అవతార్' పోస్టర్ల కలకలం