అన్నామలై '2.0 అవతార్' పోస్టర్ల కలకలం
ABN , Publish Date - Jun 01 , 2026 | 05:09 PM
బీజేపీలో కొద్దికాలంగా అసంతృప్తితో ఉన్నట్టు చెబుతున్న ఆ పార్టీ తమిళనాడు విభాగం మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై తదుపరి రాజకీయ నిర్ణయంపై ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అన్నామలై '2.0 అవతార్' పేరుతో మదురై, కోయంబత్తూరులో ఆయన అనుచరులు పెద్దఎత్తున ఏర్పాటు చేసిన పోస్టర్లు సంచలనం సృష్టిస్తున్నాయి.
చెన్నై: బీజేపీలో కొద్దికాలంగా అసంతృప్తితో ఉన్నట్టు చెబుతున్న ఆ పార్టీ తమిళనాడు విభాగం మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై (K Annamalai) తదుపరి రాజకీయ నిర్ణయంపై ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అన్నామలై '2.0 అవతార్' పేరుతో మదురై, కోయంబత్తూరులో ఆయన అనుచరులు పెద్దఎత్తున ఏర్పాటు చేసిన పోస్టర్లు సంచలనం సృష్టిస్తున్నాయి. అన్నామలై మరో అవతారం ఎత్తాలని, తమిళనాడును కాపాడాలని ఆ పోస్టర్లలో రాసి ఉంది. దీంతో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో ఆయన తదుపరి పాత్ర ఏమిటనేదే దానిపై రాజకీయ వర్గాలు, సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.
బీజేపీతో అన్నామలై తెగతెంపులు చేసుకుని సొంతంగా రాజకీయ మార్గాన్ని ఎంచుకోనున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ అపాయిమెంట్‌ను కూడా అన్నామలై కోరారు. అయితే ఎజెండా ఏమిటనేది మాత్రం ఇంకా వెల్లడి కాలేదు.
జూన్ 4న ప్రకటన
అన్నామలై పుట్టినరోజు ఈనెల 4వ తేదీ కావడంతో అదేరోజు ఆయన కీలకమైన ప్రకటన చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ త్రిభాషా విధానానికి వ్యతిరేకంగా అన్నామలై ఇటీవల సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్ట్ పెట్టారు. విద్యార్థులపై ముఖ్యంగా తమిళనాడులో ఉన్న వారిపై మానసిక ఒత్తిడిని నివారించేందుకు తక్షణం త్రిభాషా విధానం నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రిని అన్నామలై కోరారు. బీజేపీలో ఇమడటం కష్టంగా ఉందనే అసంతృప్తితో అన్నామలై ఉన్నారనే ఊహాగానాలకు ఈ పోస్ట్ ఊతమిచ్చినట్టు చెబుతున్నారు. ఈ విషయంపై ఆయన కొద్దిరోజులుగా మౌనాన్నే ఆశ్రయిస్తుండటం కూడా ఆయన తదుపరి రాజకీయ చర్యపై ఊహాగానాలను పెంచుతోంది.
మక్కల్ శక్తి ఇయక్కం
తాజా పరిణామాల నేపథ్యంలో అన్నామలై త్వరలో కొత్త పార్టీ పెట్టనున్నారంటూ ఒక ప్రాంతీయ వార్తాపత్రిక కథనం రాసింది. 'మక్కల్ శక్తి ఇయక్కం' పేరుతో ఆ పార్టీ ఉండబోతోందని కూడా పేర్కొంది. అయితే ఈ కథనాన్ని అన్నామలై అధికారంగా ఇంతవరకూ ధ్రువీకరించలేదు. 2021 నుంచి 2025 వరకూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా అన్నామలై ఉన్నారు. తమిళనాడులో బీజేపీ బలపడడానికి ఆయన చేసిన కృష్టి పార్టీ అభినందనలు కూడా అందుకుంది. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ నిర్ణయం తీసుకోవడం, కూటమికి అన్నాడీఎంకే పెద్దన్నగా వ్యవహరించడంపై అన్నామలై అసంతృప్తితో ఉన్నారు. పార్టీ టిక్కెట్ తీసుకోకుండా కేవలం ప్రచారానికే పరిమితమయ్యారు. అయితే ఎన్నికల ప్రచారంలో అన్నామలైను పార్టీ పెద్దగా పట్టించుకోలేదంటూ ఆయన క్యాంప్‌లో అసంతృప్తులు వ్యక్తమయ్యాయి.
ఇవి కూడా చదవండి..
కొత్త పార్టీ యోచనలో అన్నామలై..!
ఇద్దరు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించిన టీఎంసీ