కొత్త పార్టీ యోచనలో అన్నామలై..!
ABN , Publish Date - Jun 01 , 2026 | 02:47 PM
మాజీ ఐపీఎస్ అధికారి, తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకోన్నారంటూ ప్రచారం జరుగుతోంది. బీజేపీలో తన రాజకీయ భవిష్యత్తు విషయంలో ఆయన కొంతకాలంగా ఆలోచన చేస్తున్నారని చెబుతున్నారు.
చెన్నై: మాజీ ఐపీఎస్ అధికారి, తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై (K Annamalai) రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకోన్నారంటూ ప్రచారం జరుగుతోంది. బీజేపీలో తన రాజకీయ భవిష్యత్తు విషయంలో ఆయన కొంతకాలంగా ఆలోచన చేస్తున్నారని చెబుతున్నారు. ఇందులో భాగంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌ను కలుసుకునేందుకు ఆపాయింట్‌మెంట్ కోరారని, జూన్ 3వ తేదీ లోపు అన్నామలై ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. దీంతో అన్నామలై ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనే దానిపై రాజకీయ వర్గాలు, సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.
త్రిభాషా విధానానికి వ్యతిరేకం
మోదీ ప్రభుత్వం త్రిభాషా విధానంతో అన్నామలై విభేదిస్తున్నారు. ఈ మేరకు బహిరంగంగానే ఆయన ఇటీవల ఒక ట్వీట్ చేశారు. అప్పటి నుంచి ఆయన పార్టీలో కొనసాగే విషయంలో అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం తీవ్రమైంది. సోషల్ మీడియాలో చురుకుగా ఉంటే ఆయన సైతం ఈ ప్రచారాన్ని ఖండించ లేదు. దీంతో అన్నామలైపై వస్తున్న ఊహాగానాల్లో ఎంతో కొంత విషయం లేకపోలేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
కొత్త పార్టీ యోచనలో...
మరోవైపు, అన్నామలై కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నారంటూ ఒక వార్తా కథనం వెలువడింది. 'మక్కల్ శక్తి ఇయకమ్మ' అనే పేరుతో పార్టీ ఉంటుందని ఆ కథనం పేర్కొంది. అయితే దీనిపై అధికారిక ధ్రువీకరణ మాత్రం లేదు. 2021 నుంచి 2025 వరకూ బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా ఉన్న అన్నామలై అట్టడుగు స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేశారు. తద్వారా పార్టీలో ప్రముఖ నేతగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకోవడంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. పార్టీ టిక్కెట్‌ను కూడా నిరాకరించి ప్రచారానికే పరిమితమయ్యారు. ప్రచారంలోనూ తనను పార్టీ దాదాపు దూరంగా ఉంచిందనే అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం కూడా జరిగింది. ఈ క్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడి అపాయింట్‌మెంట్ కోరడంతో జూన్ 3వ తేదీలోగా ఏదో ఒక కీలక నిర్ణయాన్ని అన్నామలై ప్రకటిస్తారనే ప్రచారం మరింత ఊపందుకుంది.
ఇవి కూడా చదవండి..
నీట్ రీఎగ్జామ్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. ఓఎంఆర్ విధానమే ఖరారు
పశ్చిమ బెంగాల్‌లో మంత్రివర్గ విస్తరణ.. మంత్రులుగా 35మంది ప్రమాణస్వీకారం..