Share News

పశ్చిమ బెంగాల్‌లో మంత్రివర్గ విస్తరణ.. మంత్రులుగా 35మంది ప్రమాణస్వీకారం..

ABN , Publish Date - Jun 01 , 2026 | 01:31 PM

పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మంత్రివర్గాన్ని విస్తరించింది. ఈ రోజు (సోమవారం) 35మంది బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

పశ్చిమ బెంగాల్‌లో మంత్రివర్గ విస్తరణ.. మంత్రులుగా 35మంది ప్రమాణస్వీకారం..
West Bengal Cabinet Expansion

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మంత్రివర్గాన్ని విస్తరించింది. ఈ రోజు (సోమవారం) 35మంది బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. కోల్‌కతాలోని లోక్ భవన్‌లో గవర్నర్ ఆర్.ఎన్.రవి వారితో ప్రమాణం చేయించారు. అర్జున్ సింగ్, తపస్ రాయ్, శరద్వాత్ ముఖర్జీ, జగన్నాథ్ ఛటోపాధ్యాయ, శంకర్ ఘోష్‌ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.


అలాగే స్వపన్ దాస్‌గుప్తా, దూద్ కుమార్ మోండల్, దీపక్ బర్మన్, మనోజ్ ఒరాన్, గౌరీ శంకర్ ఘోష్ సహా పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. దీంతో సీఎం సువేందు అధికారితో సహా పశ్చిమ బెంగాల్ కేబినెట్‌లో మంత్రుల సంఖ్య 41కి చేరింది. రాష్ట్రంలో గరిష్ఠంగా 44 మంది మంత్రులు ఉండేందుకు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(1A) అవకాశం కల్పిస్తోంది. కాగా, ఏప్రిల్ నెలలో రెండు విడతల్లో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది.


ఈ మేరకు కోల్‌కతాలో మే 9న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు దిలీప్ ఘోష్, అగ్నిమిత్ర పాల్, నిసిత్ ప్రమాణిక్, అశోక్ కీర్తానియా, క్షుదీరామ్ టుడు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. వీరితో గవర్నర్ ఆర్.ఎన్.రవి ప్రమాణస్వీకారం చేయించారు. తాజాగా మరో 35 మంది మంత్రులు బాధ్యతలు చేపట్టారు.


ఇవి కూడా చదవండి

ట్రాఫిక్‌లో చిక్కుకున్న కారు.. రోడ్డుపై ధర్నాకు దిగిన యువకుడు..

వర్షాభావంపై రైతులకు అవగాహన కల్పించాలి: సీఎం రేవంత్ రెడ్డి

Updated Date - Jun 01 , 2026 | 01:46 PM