Share News

ట్రాఫిక్‌లో చిక్కుకున్న కారు.. రోడ్డుపై ధర్నాకు దిగిన యువకుడు..

ABN , Publish Date - Jun 01 , 2026 | 12:40 PM

గవర్నర్ కాన్వాయ్ వస్తోందంటూ అరగంట పాటు ట్రాఫిక్ నిలిపివేయడంపై ఓ సామాన్యుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. గర్భవతిగా ఉన్న భార్యను ఆస్పత్రికి తరలించేందుకు అనుమతి ఇవ్వాలని రోడ్డుపై ధర్నాకు దిగాడు.

ట్రాఫిక్‌లో చిక్కుకున్న కారు.. రోడ్డుపై ధర్నాకు దిగిన యువకుడు..
Bengaluru Governor convoy Issue

బెంగళూరు: గవర్నర్ కాన్వాయ్ వస్తోందంటూ అరగంట పాటు ట్రాఫిక్ నిలిపివేయడంపై ఓ సామాన్యుడు ఆగ్రహించాడు. గర్భవతిగా ఉన్న భార్యను ఆస్పత్రికి తరలించేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై ధర్నాకు దిగాడు. వీఐపీల కోసం మండుటెండలో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తారా? అంటూ పోలీసులను నిలదీశాడు. గవర్నర్ వచ్చే సమయం కావడం, యువకుడు రోడ్డుపై భైఠాయించడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..


బెంగళూరులోని ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ రోడ్డుపై పోలీసులు ట్రాఫిక్ నిలిపివేశారు. గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ వస్తుండడంతో ట్రాఫిక్‌ను నియంత్రించారు. దాదాపు 30 నిమిషాల పాటు భారీగా వాహనాలను నిలిపివేశారు. దీంతో ఎండలో సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అరగంట గడిచినా వాహనాలను పంపించకపోవడంపై ఓ యువకుడు ఆగ్రహించాడు. నేరుగా వెళ్లి రోడ్డుపై భైఠాయించి ధర్నాకు దిగాడు. దీంతో పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే రోడ్డుపై నుంచి లేచి వెళ్లిపోవాలని ఆదేశించారు.


తన భార్యను అత్యవసరంగా ఆస్పత్రికి తీసుకెళ్లాలని, తాము వెళ్తున్న కారు ట్రాఫిక్‌లో చిక్కుకుందని యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. 'సార్, నా భార్య గర్భవతి. అత్యవసర వైద్య పరిస్థితి కంటే వీఐపీలకు ఎందుకంత ప్రాధాన్యం ఇస్తున్నారు?' అంటూ ప్రశ్నించాడు. కారును పంపించేంత వరకు తాను లేచేది లేదని పోలీసులకు తేల్చి చెప్పాడు. దీంతో చేసేదేమీ లేక అతని కారును అక్కడి నుంచి పంపించేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.


కాగా, ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ రోడ్డుమార్గంలో ప్రస్తుతం అండర్‌పాస్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో స్థానికులను ట్రాఫిక్ సమస్య వేధిస్తోంది. మరోవైపు వీఐపీల కోసం గంటల తరబడి వాహనాలను నిలిపివేస్తున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

తమిళనాడులో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి దుర్మరణం

నేడు పశ్చిమ బెంగాల్ కేబినెట్ విస్తరణ.. 35 మందికి మంత్రులుగా అవకాశం..

Updated Date - Jun 01 , 2026 | 01:30 PM