Share News

బెంగాల్‌‌లో చారిత్రక తీర్పు.. విజయోత్సవ సంబరాల్లో మోదీ

ABN , Publish Date - May 04 , 2026 | 07:56 PM

బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అసాధారణమైన, చారిత్రక తీర్పునిచ్చారని, ఆ ఆనందం కార్యకర్తల కళ్లలో స్పష్టంగా కనిపిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బెంగాల్‌లో నూతన చరిత్రను ఆవిష్కరించిన బీజేపీ కార్యకర్తలను అభినందించారు.

బెంగాల్‌‌లో చారిత్రక తీర్పు.. విజయోత్సవ సంబరాల్లో మోదీ
PM Modi

న్యూఢిల్లీ: బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అసాధారణమైన, చారిత్రక తీర్పునిచ్చారని, ఆ ఆనందం కార్యకర్తల కళ్లలో స్పష్టంగా కనిపిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. బెంగాల్‌లో నూతన చరిత్రను ఆవిష్కరించిన బీజేపీ కార్యకర్తలను అభినందించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ మార్గదర్శకంలో జరిగిన తొలి ఎన్నికలు ఇవంటూ ఆయనకు అభినందనలు తెలిపారు. గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకూ ప్రతిచోట కమలం వికసించిందని, కామాక్ష అమ్మవారి ఆశీర్వచనం పుష్కలంగా లభించిందని చెప్పారు. పశ్చిమబెంగాల్, అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడంతో పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం సాయంత్రం జరిగిన విజయోత్సవ సంబరాల్లో ప్రధానమంత్రి పాల్గొన్నారు. బెంగాలీ ధోతితో విచ్చేసిన ప్రధానికి పార్టీ అగ్రనేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున స్వాగతం పలికారు. 'మోదీ మోదీ' నినాదాలతో కార్తకర్తలు హోరెత్తించారు.


ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, బెంగాల్ బీజేపీ విజయంతో శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆత్మకు ఉపశమనం కలిగిందన్నారు. అభ్యుదయ బెంగాల్‌ కోసం ఆయన కలలుగన్నారని, అది ఇన్నేళ్ల తర్వాత వాస్తవరూపం దాల్చిందని పేర్కొన్నారు. బెంగాల్ ప్రజలు బీజేపీకి ఒక అవకాశం ఇచ్చారని చెప్పారు. బెంగాల్‌లో మార్పుకోరుతూ పవనాలు బలంగా వీచాయని పేర్కొన్నారు. బీజేపీ అంటేనే సుపరిపాలన అనే విషయం ప్రజలకు బాగా తెలుసునని ప్రశంసించారు.


అస్సాంలో బీజేపీ-ఎన్డీయేను ప్రజలు మరోసారి ఆశీర్వదించారని, అభివృద్ధికి ప్రజలు బాసటగా నిలిచారని ప్రధాని కొనియాడారు. తిరుగులేని తీర్పునిచ్చిన అస్సాం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర సర్వోతోముఖాభివృద్ధికి భరోసాగా ఉంటామన్నారు. దశాబ్దాలుగా పార్టీ, కూటమి ఎదుగుదలకు అవిశ్రాంతంగా కృషి చేసిన బీజేపీ-ఎన్డీయే కార్యకర్తలను అభినందించారు.


థాంక్యూ పుదుచ్చేరి

ముఖ్యమంత్రి ఎన్.రామస్వామి సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం టాక్ రికార్డు, సుపరిపాలనకు మరోసారి పట్టం కట్టిన పుదుచ్చేరి ప్రజలకు మోదీ ధన్యవాదాలు తెలియజేశారు. కార్యకర్తలకు అభినందనలు చెప్పారు.


యూడీఎఫ్‌కు అభినందనలు

కేరళలో విజయం సాధించిన యూడీఎఫ్‌కు ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు. బీజేపీ-ఎన్డీయేకు ఓటు వేసిన వారికి ధన్యవాదాలు తెలియజేశారు. కేరళ ప్రగతి కోసం, వికసిత కేరళం విజన్ సాకారం కోసం తాము పనిచేస్తామని చెప్పారు. కేరళం ప్రజల అభివృద్ధి ఆకాంక్షలకు తమ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుందన్నారు.


టీవీకేకు సైతం...

తమిళనాడులో మంచి ఫలితాలు సాధించిన విజయ్ టీవీకేను ప్రధాని అభినందించారు. ఎన్డీయేకు మద్దతుగా ఓటు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాసమస్యలు, వారి జీవనప్రమాణాల మెరుగుదలకు తాము ఎప్పుడూ ముందుంటామని చెప్పారు. తమిళనాడు ప్రగతి, ప్రజాక్షేమానికి కట్టుబడి ఉంటామని తెలిపారు.


ఇవి కూడా చదవండి..

ఈ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి: ప్రధాని మోదీ

ఆ అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లోనూ బీజేపీదే హవా!

Updated Date - May 04 , 2026 | 08:31 PM