Share News

బెంగాల్‌లో 284 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. బహ్రాంపుర్ నుంచి అధీర్ రంజన్

ABN , Publish Date - Mar 29 , 2026 | 09:20 PM

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే 284 మంది అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఆదివారంనాడు ప్రకటించింది. బహ్రాంపుర్ అసెంబ్లీ నియోజకవర్గ నుంచి పార్టీ సీనియర్ నేత, మాజీ విపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి పోటీ చేస్తున్నారు.

బెంగాల్‌లో 284 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. బహ్రాంపుర్ నుంచి అధీర్ రంజన్
West Bengal Congress

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే 284 మంది అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఆదివారంనాడు ప్రకటించింది. బహ్రాంపుర్ (Baharampur) అసెంబ్లీ నియోజకవర్గ నుంచి పార్టీ సీనియర్ నేత, మాజీ విపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి(Adhir Ranjan Chowdhury) పోటీ చేస్తున్నారు. ఇటీవల కాలంలో పలు సందర్భాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్టు ఆయన చెప్పారు. మాలతీపూర్ (Malatipur) నుంచి మరో కీలక నేత, ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీ మౌసమ్ నూర్ పోటీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రదీప్ ప్రసాద్ పోటీ చేస్తున్నారు.


adhir-ranjan.jpg

పోటీలో ఉన్న కీలక అభ్యర్థుల్లో డార్జిలింగ్ నుంచి మధాప్ రాయ్, సుజాపూర్ నుంచి అబ్దుల్ హన్నన్, డుమ్ డుమ్ నుంచి సుస్మితా బిశ్వాస్, డైమండ్ హార్బర్ నుంచి గౌతమ్ భట్టారాయ్, అసాంసోల్ దక్షిణ్ నుంచి సౌవిక్ ముఖర్జీ, అసాంసోల్ ఉత్తర్ నుంచి ప్రసేన్‌జిత్ పుయితాండి పోటీ చేస్తున్నారు.


ఢిల్లీలో శనివారంనాడు జరిగిన పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) సమావేశంలో అభ్యర్థుల తుది జాబితాను ఖరారు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్, పశ్చిమబెంగాల్ మాజీ అధ్యక్షుడు అధిర్ రంజన్, సీఈసీ సభ్యులు అంబికా సోని, మధుసూదన్ మిస్ర్తీ, సల్మాన్ ఖుర్షీద్, టీఎస్ సింగ్‌దేవ్, కేజీ జార్జి, పీఎల్ పునియా, అమీ యాజ్నిక్, పశ్చిమబెంగాల్ ఏఐసీసీ ఇన్‌ఛార్జి గులాం అహ్మద్ మీర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి రెండు విడతలుగా ఏప్రిల్ 23, 29 తేదీల్లో పోలింగ్ జరగనుండగా, మే 4న ఫలితాలు వెలువడతాయి.


ఇవి కూడా చదవండి..

రైతన్నలకు సాయం, మహిళలకు నెలవారీ గ్రాంట్... డీఎంకే మేనిఫెస్టో

వాళ్లు వచ్చారో మీరు మాంసం కూడా తినలేరు: మమతా బెనర్జీ

Updated Date - Mar 29 , 2026 | 09:56 PM