పరిశీలకులను పంపాలని ఆహ్వానం వచ్చింది.. బంగ్లా ఎన్నికలపై ఎంఈఏ
ABN , Publish Date - Feb 12 , 2026 | 08:20 PM
బంగ్లాదేశ్‌లో పార్లమెంటు ఎన్నికలకు పరిశీలకులను పంపాలని భారత్‌కు అధికారిక ఆహ్వానం అందిందని, అయితే దీనికి దూరంగా ఉండాలని భారత్ నిర్ణయం తీసుకుందని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ తెలిపారు.
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో పార్లమెంటు ఎన్నికలకు పరిశీలకులను పంపాలని భారత్‌కు అధికారిక ఆహ్వానం అందిందని, అయితే దీనికి దూరంగా ఉండాలని భారత్ నిర్ణయం తీసుకుందని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ తెలిపారు. గురువారంనాడిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియలో జోక్యానికి సంబంధించి ఎలాంటి అభిప్రాయాలకు తావీయరాదని భావించినందువల్లే పరిశీలకులను పంపలేదని చెప్పారు. ఎన్నికల విశ్వసనీయత అనేది బంగ్లా ప్రజలకు సంబంధించిన అంశమని అన్నారు.
బంగ్లాదేశ్‌లో స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు జరగాలని భారత్ మొదట్నించీ కోరుతోందని, ఎన్నికల ఫలితాల కోసం వేచిచూస్తున్నామని జైశ్వాల్ తెలిపారు. 'ప్రజలు ఇచ్చే తీర్పు కోసం మనం వేచిచూడాల్సి ఉంటుంది. ఆ తర్వాతే అక్కడ మనకున్న సమస్యలపై దృష్టి సారిస్తాం' అని జైశ్వాల్ చెప్పారు. భారత్, బంగ్లాదేశ్ మధ్య ఇటీవల కాలంలో ద్వైపాక్షిక సంబంధాలు క్లిష్ట పరిస్థితుల్లో పడ్డాయి. అక్కడి మైనారిటీ హిందువులపై దాడులు, హత్యాకాండలు కొనసాగుతుండటంపై భారత్ తన ఆందోళనను యూనస్ తాత్కాలిక ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకువచ్చింది.
పోలింగ్ పూర్తి.. వెలువడుతున్న ఫలితాలు
షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత 18 నెలలకు నిర్వహించిన బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికల పోలింగ్ గురువారం ముగిసింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ వెంటనే మొదలైంది. 299 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగగా, బీఎన్పీ, జమాత్-ఇ-ఇస్లామీ మధ్యే పోటీ ప్రధానంగా సాగింది. ప్రాథమిక ఫలితాల్లో బీఎన్పీ ముందంజలో ఉంది.
ఇవి కూడా చదవండి..
114 రఫేల్ యుద్ధ విమానాలు, 6 పీ8ఐ విమానాలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
స్పీకర్ ఛాంబర్లో కాంగ్రెస్ ఎంపీల వీరంగం.. వీడియో షేర్ చేసిన కిరణ్ రిజిజు