Share News

ఇదే చివరి ఛాన్స్! విజయ్ మాల్యాకు బాంబే హైకోర్టు వార్నింగ్

ABN , Publish Date - Feb 12 , 2026 | 06:19 PM

భారత్‌కు వస్తారో? రారో? స్పష్టం చేయాలని వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాకు బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఇదే చివరి ఛాన్స్ అని తేల్చి చెప్పింది.

ఇదే చివరి ఛాన్స్! విజయ్ మాల్యాకు బాంబే హైకోర్టు వార్నింగ్
Vijay Mallya

ఇంటర్నెట్ డెస్క్: పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా (Vijay Mallya) కేసు విషయంలో బాంబే హైకోర్టు (Bombay High Court) తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. మాల్యా భారత్‌కు తిరిగి వచ్చే వరకూ ఆయన పిటిషన్‌ను విచారణకు స్వీకరించేది లేదని పేర్కొంది. మాల్యాను పరారీలో ఉన్న ఆర్థికనేరస్థుడిగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ ఆయన తరపు న్యాయవాదులు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.

ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ శ్రీచంద్ర శేఖర్, జస్టిస్ గౌతమ్ అఖండ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు తిరిగి రావడంపై స్పష్టతనిచ్చేందుకు మాల్యాకు ఇదే చివరి అవకాశమని ధర్మాసనం పేర్కొంది. మాల్యా భారత్‌కు రానంటే ఈ పిటిషన్‌ను స్వీకరించలేమని తేల్చి చెప్పింది.


నగదు అక్రమ రవాణా, లోన్‌లు చెల్లించకపోవడం తదితర ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ మాల్యా 2016 నుంచి బ్రిటన్‌లో ఉంటున్న విషయం తెలిసిందే. ఆయనపై ఇప్పటికే పీఎమ్ఎల్‌ఏ చట్టం కింద కేసు నమోదైంది. ఈ విషయమై విచారణ చేపట్టిన ప్రత్యేక న్యాయస్థానం 2019లో మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడిగా ప్రకటించింది. ఇక మాల్యాను భారత్‌కు రప్పించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేపట్టిన చర్యలు కీలక దశకు చేరుకున్నాయి.

మరోవైపు, విజయ్ మాల్యా కూడా కోర్టును ఆశ్రయించారు. తనను పరారీలో ఉన్న నేరస్థుడిగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుల చట్టం-2018 రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ మరో పిటిషన్‌ను దాఖలు చేశారు.


ఈ వార్తలూ చదవండి:

రష్యాలో భారతీయ విద్యార్థుల ఇక్కట్లు! పెరుగుతున్న ఫిర్యాదులు!

మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస

Updated Date - Feb 12 , 2026 | 06:20 PM