Share News

మణిపుర్‌లో మళ్లీ చెలరేగిన హింస

ABN , Publish Date - Feb 10 , 2026 | 03:01 PM

మణిపుర్‌లోని ఉఖ్రుల్ జిల్లాలో మంగళవారం ఉదయం మళ్లీ హింసాకాండ చెలరేగింది. గత శనివారం రాత్రి టాంగ్‌ఖుల్ నాగ కమ్యూనిటీకి చెందిన ఒక వ్యక్తిపై కొందరు దాడి చేశారనే ఆరోపణలతో మొదలైన వివాదం క్రమంగా పెద్దఎత్తున హింసకు దారితీసింది.

మణిపుర్‌లో మళ్లీ చెలరేగిన హింస
Manipur Violence

ఇంఫాల్: మణిపుర్‌లోని ఉఖ్రుల్ జిల్లాలో మంగళవారం ఉదయం మళ్లీ హింసాకాండ చెలరేగింది. గత శనివారం రాత్రి టాంగ్‌ఖుల్ నాగ కమ్యూనిటీకి చెందిన ఒక వ్యక్తిపై కొందరు దాడి చేశారనే ఆరోపణలతో మొదలైన వివాదం క్రమంగా పెద్దఎత్తున హింసకు దారి తీసింది. వందలాది మంది టాంగ్‌ఖుల్ గ్రామస్థులు, ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధులు ఇళ్లు వదిలి కాంగ్పోక్పి, ఉఖ్రుల్ జిల్లాలోని సురక్షిత ప్రాంతాలకు.. రెండ్రోజులుగా తరలిపోతున్నారు. ఈ క్రమంలో ఉఖ్రుల్ జిల్లాలో తాజాగా హింస చెలరేగింది. నాగాలు వదలివెళ్లిన ఇళ్లకు కొందరు నిప్పు పెట్టారని, కాల్పులు చోటుచేసుకున్నాయని పోలీసులు తెలిపారు.


ఉఖ్రుల్, కాంజోంగ్ జిల్లాల్లో కుకీల కదలికలపై రెండు నాగా సంస్థలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో లిటాన్ సారేఖాంగ్‌లో కాల్పులు, ఇళ్లకు నిప్పుపెట్టడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. కొందరు సాయుధులు.. నాగాలు విడిచివెళ్లిన ఇళ్లకు నిప్పుపెట్టి, కాల్పులు జరిపారని, పరిస్థితి ఉద్రిక్తంగానే ఉందని ఓ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు అదనపు సాయుధ బలగాలను ఆ ప్రాంతంలో మోహరించినట్టు చెప్పారు.


కాగా, ముందు జాగ్రత్త చర్యగా ఉఖ్రుల్ జిల్లా రెవెన్యూ పరిధిలో బ్రాడ్‌బ్యాండ్, వీపీఎన్, వీసాట్ సహా ఇంటర్నెట్ సర్వీసులను 5 రోజుల పాటు మణిపుర్ ప్రభుత్వం నిలిపివేసింది. సాయుధుల హింసాకాండలో ఇప్పటివరకూ మొత్తం 21 ఇళ్లు దగ్ధమైనట్టు మంత్రి గోవిందాస్ కొంతౌజం తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగానే ఉందని, శాంతియుత పరిస్థితులు నెలకొల్పేందుకు అదనపు బలగాలను పంపామన్నారు.


ఇవి కూడా చదవండి..

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం.. నోటీసులిచ్చిన కాంగ్రెస్

పీఎం కేర్స్‌పై ప్రశ్నలొద్దు

Updated Date - Feb 10 , 2026 | 03:25 PM