పీఎం కేర్స్‌పై ప్రశ్నలొద్దు
ABN , Publish Date - Feb 10 , 2026 | 03:38 AM
పీఎం కేర్స్ ఫండ్, జాతీయ రక్షణనిధి (ఎన్‌డీఎఫ్), ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి(పీఎంఎన్‌ఆర్‌ఎ్‌ఫ)లకు సంబంధించి పార్లమెంటులో...
లోక్‌సభ సచివాలయానికి పీఎంవో సూచన
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: పీఎం కేర్స్ ఫండ్, జాతీయ రక్షణనిధి (ఎన్‌డీఎఫ్), ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి(పీఎంఎన్‌ఆర్‌ఎ్‌ఫ)లకు సంబంధించి పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు.. ఆయా అంశాలను ప్రస్తావించేందుకు లోక్‌సభ నిబంధనల ప్రకారం అనుమతి లేదని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) లోక్‌సభ సచివాలయానికి స్పష్టంచేసింది. భారత సంచిత నిధి నుంచి వీటికి కేటాయింపుల్లేవని.. అవి పూర్తిగా ప్రజల స్వచ్ఛంద విరాళాలతో ఏర్పాటయ్యాయని.. పబ్లిక్ చారిటీ ట్రస్టుగా రిజిస్టరయ్యాయని.. వాటి డీడ్‌లు సైతం రిజిస్ట్రేషన్ చట్టం కింద నమోదయ్యాయని తెలిపింది. లోక్‌సభ కార్యకలాపాల నిబంధనల ప్రకారం.. భారత ప్రభుత్వంతో సంబంధం లేని అంశాలపై సభలో ప్రశ్నలను అనుమతించే అవకాశం లేదంటూ గత నెల 30న లోక్‌సభ సచివాలయానికి పీఎంవో సమాచారమిచ్చినట్లు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పత్రిక తాజాగా తెలియజేసింది. కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో 2020 మార్చి 27న ప్రధానమంత్రి సిటిజెన్ అసిస్టెన్స్-రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ ఫండ్ (పీఎం కేర్స్ ఫండ్) ఏర్పాటైంది. కొవిడ్-19లాంటి అత్యవసర పరిస్థితులు ఉత్పన్నమైతే బాధితులకు సాయం చేయడానికి వీలుగా ఏర్పాటుచేశారు. 2023 మార్చి వరకు ఈ ఫండ్‌కు చేరిన విరాళాలు రూ.6,283.7 కోట్లు అని అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించారు.