మాపై ఇంత తీవ్ర ఆరోపణా!
ABN , Publish Date - Feb 10 , 2026 | 03:36 AM
తమ నుంచి ప్రధాని మోదీ భద్రతకు ముప్పు పొంచి ఉన్నట్లు నిర్దిష్ట సమాచారం అందిందని.. అందుకే గత గురువారం లోక్‌సభకు రావద్దని ఆయనకు తానే సూచించానని స్పీకర్ ఓం బిర్లా చేసిన ప్రకటనపై కాంగ్రెస్ మహిళా...
ప్రధాని మోదీపై మహిళా ఎంపీలు దాడి చేస్తారని తనకు సమాచారం ఉందన్న స్పీకర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మహిళా ఎంపీలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: తమ నుంచి ప్రధాని మోదీ భద్రతకు ముప్పు పొంచి ఉన్నట్లు నిర్దిష్ట సమాచారం అందిందని.. అందుకే గత గురువారం లోక్‌సభకు రావద్దని ఆయనకు తానే సూచించానని స్పీకర్ ఓం బిర్లా చేసిన ప్రకటనపై కాంగ్రెస్ మహిళా ఎంపీలు మండిపడ్డారు. తమపై ఇంత తీవ్ర ఆరోపణలు చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. లోక్‌సభకు రాని ప్రధానిని సమర్థించే క్రమంలో ఆయన అధికార పార్టీ ఒత్తిళ్లకు లోనయ్యారని ఆరోపించారు. ఈ మేరకు సోమవారం ఆయనకు లేఖ రాశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని జవాబు ఇవ్వకుండానే గత గురువారం లోక్‌సభ అసాధారణ రీతిలో తీర్మానాన్ని ఆమోదించిన సంగతి తెలిసిందే. బుధవారం(4న) సాయంత్రమే ఆయన ప్రసంగించాల్సి ఉండగా.. గందరగోళం కొనసాగడం.. ప్రతిపక్షానికి చెందిన కొందరు మహిళా ఎంపీలు మోదీ రాకముందే ఆయన సీటు వద్ద మోహరించారు. ప్యానెల్ స్పీకర్, మంత్రులు, బీజేపీ ఎంపీలు ఎన్ని సార్లు విజ్ఞప్తిచేసినా వారు వెనక్కి రాలేదు. దాంతో ప్రధాని ప్రసంగం గురువారాని(5వ తేదీ)కి వాయిదాపడింది. కానీ విపక్షాలు, అధికార పార్టీ సభ్యుల పరస్పర నినాదాలతో ఆయన ప్రసంగం లేకుండానే ధన్యవాద తీర్మానాన్ని మూజువాణి ఓటుతో ఆమోదించినట్లు స్పీకర్ ప్రకటిస్తూ.. మహిళా విపక్ష ఎంపీలపై పై వ్యాఖ్యలు చేశారు. దీనిపై వారు సోమవారం వారు లేఖ రాశారు. దానిపై సంతకం చేసిన కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకాగాంధీ వాద్రా మీడియాతో మాట్లాడారు. ‘ప్రధానిపై చెయ్యెత్తడం గానీ, మరేదైనా గానీ చేసే ప్రశ్నే ఉత్పన్నం కాదు. 11 మంది మహిళా ఎంపీలున్నారు. స్పీకర్ ఇలాంటి ప్రకటన చేసి ఉండాల్సింది కాదు. ఆ రోజున సభకు వచ్చే ధైర్యం మోదీకి లేదు. అందుకే ఆయన తరఫున స్పీకర్‌తో అలా వివరణ ఇప్పించారు. ఇది తప్పు’ అని అన్నారు.
సభాపతి ఆందోళన సమంజసమే
తమ మహిళా ఎంపీల నుంచి ప్రధానికి ఎలాంటి ముప్పూ లేదన్న ప్రతిపక్షాల వాదనను లోక్‌సభ వర్గాలు తోసిపుచ్చాయి. ఆ మహిళా ఎంపీలు మోదీ కుర్చీ వద్దకు దుందుడుకుగా దూసుకొచ్చారని.. ఆయన భద్రతకు సంబంధించి స్పీకర్ ఓం బిర్లా ఆందోళన చెందడం సమంజసమేనని స్పష్టంచేశాయి. అవాంఛనీయ ఘటనలేమీ జరుగకుండా.. సభ గౌరవాన్ని, పవిత్రతను కాపాడేందుకు.. కార్యకలాపాలు సజావుగా జరిగేలా చూసేందుకే ప్రధానిని సభకు రావొద్దని ఆయన సలహా ఇచ్చారని తెలిపాయి.