Share News

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన ఖరారు.. ఏడాదిలో రెండోసారి

ABN , Publish Date - May 19 , 2026 | 05:00 PM

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన ఖరారైంది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఆయన భారత్‌లో పర్యటించనున్నారు. న్యూఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా జరుగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం-2026లో పాల్గొంటారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన ఖరారు.. ఏడాదిలో రెండోసారి
Modi with Putin

న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన ఖరారైంది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఆయన భారత్‌లో పర్యటించనున్నారు. న్యూఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా జరుగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం-2026 (BRICS Summit 2026)లో పాల్గొనేందుకు పుతిన్ భారతదేశం వస్తున్నారని రష్యా ప్రభుత్వ ప్రధాన కార్యాలయం క్రెమ్లిన్ అధికార ప్రతినిధి యూరి ఉషకోవ్ మంగళవారంనాడు తెలిపారు.


ఏడాది వ్యవధిలోనే పుతిన్ భారతదేశంలో పర్యటించనుండటం ఇది రెండోసారి అవుతుంది. 2025 డిసెంబర్‌లో ఆయన న్యూఢిల్లీలో పర్యటించారు. 23వ ఇండియా-రష్యా వార్షిక సదస్సులో పాల్గొన్నారు. పుతిన్ పర్యటనతో ఇరుదేశాల రక్షణ, వాణిజ్యం, ఇంధన రంగాల బంధాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లారు. చివరిసారిగా బ్రిక్స్ నేతలు బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో గత ఏడాది జూలైలో జరిగిన 17వ బ్రిక్స్ సదస్సులో పాల్గొన్నారు.


భారతదేశం ఈ ఏడాది బ్రిక్స్ కూటమి అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తోంది. ఈ నెల ప్రారంభంలో రష్యా విదేశాంగ మంత్రి సర్జే లావ్రోవ్ భారతదేశంలో పర్యటించారు. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కీలక చర్చలు జరిపారు. ప్రపంచ వేదికపై గ్లోబల్ సౌత్ వాణిని బలోపేతం చేయడానికి బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికాతో కూడిన అంతర్జాతీయ కూటమిగా బ్రిక్స్ ఏర్పాటైంది. కూటమి విస్తరణలో భాగంగా ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ కూడా చేరాయి. దీంతో మొత్తం సభ్యుల సంఖ్య 11కు చేరింది.


ఇవి కూడా చదవండి..

ఆర్థిక తుఫాన్ రాబోతోంది.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు

మమతా బెనర్జీకి షాక్.. పోటీ నుంచి తప్పుకున్న ఎమ్మెల్యే అభ్యర్థి..

Updated Date - May 19 , 2026 | 05:55 PM