Share News

ఆర్థిక తుఫాన్ రాబోతోంది.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - May 19 , 2026 | 04:19 PM

ఐదు రోజుల్లో రెండు సార్లు ఇంధనం ధరలు పెరగడంపై లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో త్వరలో ఆర్థిక తుఫాన్ రాబోతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలే ఈ దుస్థితికి కారణమని పేర్కొన్నారు.

ఆర్థిక తుఫాన్ రాబోతోంది.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi

రాయబరేలి: ఐదు రోజుల్లో రెండు సార్లు ఇంధనం ధరలు పెరగడంపై లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో త్వరలో ఆర్థిక తుఫాన్ రాబోతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలే ఈ దుస్థితికి కారణమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సృష్టించిన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలనుందని, సాధారణ ప్రజానీకంపై ఇది పెనుభారం కానుందని అన్నారు.


ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలిలో రెండ్రోజుల పర్యటనకు వచ్చిన రాహుల్ అక్కడి మీడియాతో మాట్లాడుతూ, బిలియనీర్లు, పారిశ్రామికవేత్తల కోసం ప్రభుత్వ ఆర్థిక విధానాల రూపకల్పన జరిగిందన్నారు. ఇది పూర్తిగా కుప్పకూలనుందని చెప్పారు. దేశ యువత, రైతులు, చిన్న వ్యాపారులపై ఆర్థిక సంక్షోభ ప్రభావం తీవ్రంగా ఉంటుందని వివరించారు. అయితే ఈ ప్రభావం అదానీ, అంబానీ, మోదీలపై ఏమాత్రం ఉండదన్నారు. మునుముందు అంతా ఇక గడ్డుకాలమేనని చెప్పారు. ఆర్థిక సంక్షోభ నివారణకు కచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడానికి బదులు విదేశాలకు వెళ్లొద్దని మోదీ చెబుతున్నారని, ఆయన మాత్రం ప్రపంచమంతా తిరుగుతుంటారని విమర్శించారు.


'బిలియనీర్ల కోసం మోదీ ఆర్థిక వ్యవస్థను తారుమారు చేశారు. గత కొన్ని రోజులుగా ఈ విషయమే ప్రజలకు నేను వివరిస్తున్నాను. ఇప్పుడు ఆర్థిక సంక్షోభం విరచుకుపడనుంది. ఇందువల్ల కీలక పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలపై ఎలాంటి ప్రభావం ఉండదు. వాళ్లు హాయిగా తామున్న చోటే ఉంటారు. కానీ యూపీలోని యువకులు, ప్రజలపై ఈ ఆర్థిక తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుంది' అని రాహుల్ అన్నారు.


ఇవి కూడా చదవండి..

మమతా బెనర్జీకి షాక్.. పోటీ నుంచి తప్పుకున్న ఎమ్మెల్యే అభ్యర్థి..

ఉత్తరాఖండ్ మాజీ సీఎం బీసీ ఖండూరి కన్నుమూత

Updated Date - May 19 , 2026 | 05:04 PM