ఉత్తరాఖండ్ మాజీ సీఎం బీసీ ఖండూరి కన్నుమూత
ABN , Publish Date - May 19 , 2026 | 02:58 PM
ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి మేజర్ జనరల్ (రిటైర్డ్) భువన్ చంద్ర ఖండూరి సుదీర్ఘ అస్వస్థతతో మంగళవారంనాడు కన్నుమూశారు. ఆయన వయస్సు 91 సంవత్సరాలు.
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి మేజర్ జనరల్ (రిటైర్డ్) భువన్ చంద్ర ఖండూరి (Bhuwan Chandra Khanduri) సుదీర్ఘ అస్వస్థతతో మంగళవారంనాడు కన్నుమూశారు. ఆయన వయస్సు 91 సంవత్సరాలు. మాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఉత్తరాఖండ్ రాజకీయాల్లో ప్రముఖ నేతగా, రెండుసార్లు ముఖ్యమంత్రిగా సేవలందించిన ఖండూరి మృతితో రాష్ట్రంలో విషాద ఛాయలు అలముకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ సహా పార్టీలకు అతీతంగా పలువురు రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతగా ఖండూరి 2007 నుంచి 2009 వరకూ, తిరిగి 2011 నుంచి 2012 వరకూ రెండు సార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. 2009లో రాష్ట్రంలోని ఐదు లోక్‌సభ స్థానాల్లో పార్టీ ఓడిపోవడంతో నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేశారు. 2011లో ఆయనను తిరిగి సీఎంగా పార్టీ నియమించింది. కేంద్ర మంత్రిగా కూడా ఖండూరి పనిచేశారు. దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మంత్రివర్గంలో రోడ్లు, రవాణా శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. రాజకీయాల్లోకి రాకముందు ఇండియన్ ఆర్మీలో మేజర్ జనరల్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. క్రమశిక్షణ, మంచి పాలనాదక్షత కలిగిన నేతగా ఆయనకు పేరుంది. 16వ లోక్‌సభలో గడ్వాల్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఖండూరికి భార్య అరుణ, కుమారుడు మనీష్, కుమార్తె రీతు ఖండూరి భూషణ్ ఉన్నారు.
ఖండూరి మృతి తీరని లోటు
జనరల్ ఖండూరి మృతికి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సంతాపం తెలిపారు. ఆయన మృతి రాష్ట్రానికే కాకుండా జాతీయ రాజకీయ రంగానికి తీరని లోటని అన్నారు. భారత సైన్యంలో అసమాన సేవలందించారని, దేశసేవ, క్రమశిక్షణ, అంకితభావానికి ఉదాహరణగా నిలిచారని గుర్తుచేసుకున్నారు. ఉత్తరాఖండ్ ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని, ఆయన ఆత్మకు శాంతికలగాలని కోరుకుంటున్నానని అన్నారు.
ప్రధాని సంతాపం
ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, మేజర్ జనరల్ భువన్ చంద్ర ఖండూరి మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం తెలియజేశారు. భారత సైన్యంలో మేజర్ జనరల్‌గా, ఆ తర్వాత రాజకీయరంగంలో ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తిండిపోతాయని అన్నారు. ఉత్తరాఖండ్ అభివృద్ధికి అంకితభావంతో పనిచేశారని గుర్తుచేసుకున్నారు. కేంద్ర మంత్రిగా కూడా ఆయన అందరికీ స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానని తన సంతాప సందేశంలో ప్రధాని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
జస్టిస్ స్వర్ణకాంత శర్మపై వ్యాఖ్యల కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌కు నోటీసులు..
విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలొచ్చు.. ఎంకే స్టాలిన్ సంచలన కామెంట్స్..