మమతా బెనర్జీకి షాక్.. పోటీ నుంచి తప్పుకున్న ఎమ్మెల్యే అభ్యర్థి..
ABN , Publish Date - May 19 , 2026 | 03:18 PM
పశ్చిమ బెంగాల్‌లోని ఫల్తా నియోజకవర్గ తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జహంగీర్ ఖాన్ పార్టీ అధినేత మమతా బెనర్జీకి షాక్ ఇచ్చారు. మే 21న జరగనున్న రీపోలింగ్ నుంచి తాను వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని ఫల్తా నియోజకవర్గ తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జహంగీర్ ఖాన్ పార్టీ అధినేత మమతా బెనర్జీకి షాక్ ఇచ్చారు. మే 21న జరగనున్న రీపోలింగ్ నుంచి తాను వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించిన ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు. నియోజకవర్గ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పోటీ నుంచి తాను తప్పుకుంటున్నట్లు జహంగీర్ ఖాన్ చెప్పారు.
తాను ఫల్తా నియోజకవర్గ బిడ్డనని, ఈ ప్రాంతమంతా శాంతియుతంగా ఉండి అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు జహంగీర్ పేర్కొన్నారు. ఫల్తా అభివృద్ధికి ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రత్యేక ప్యాకేజీని ఇస్తున్నారని.. అందుకే తాను పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. టీఎంసీ ఎమ్మెల్యే అభ్యర్థి నిర్ణయంతో మమతా బెనర్జీకి ఎదురుదెబ్బ తగిలినట్లు అయ్యింది. మరోవైపు మే 21న జరిగే ఎన్నికల్లో బీజేపీ తరఫున దేబాంగ్షు పాండా, కాంగ్రెస్ తరఫున అబ్దుర్ రజాక్ మొల్లా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) తరఫున శంభు నాథ్ కుర్మి పోటీ పడనున్నారు.
రీపోలింగ్ ఎందుకంటే..
ఏప్రిల్ 29న రెండో దశ ఎన్నికల్లో భాగంగా ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గానికి పోలింగ్ జరిగింది. మొత్తం 285 పోలింగ్ బూత్‌లలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు తరలివెళ్లారు. ఈ సందర్భంగా పలు బూత్‌ల వద్ద అల్లర్లు చోటుచేసుకున్నాయి. బీజేపీ అభ్యర్థి దేబాంగ్షు పాండా కూడా పలు ఆరోపణలు చేశారు. ఈవీఎంలపై ఉన్న బీజేపీ బటన్‌ను తెల్లటి జిగురుతో కప్పివేశారని, దీంతో ఓటర్లు తమ పార్టీకి ఓటు వేయలేకపోయారని ఆరోపించారు. ఈ మేరకు ఫల్తా నియోజకవర్గానికి మే 21న రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. కాగా, ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీల్లో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది.
ఈ వార్తలు కూడా చదవండి
జస్టిస్ స్వర్ణకాంత శర్మపై వ్యాఖ్యల కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌కు నోటీసులు..
ఉత్తరాఖండ్ మాజీ సీఎం బీసీ ఖండూరి కన్నుమూత